ఉపాధి హామీ సిబ్బంది ఆందోళనకు సిద్ధమయ్యారు. వేతనాలు సరిగా రాకపోవడం, అది కూడా ఏడాది కాలంగా నాలుగు నెలలకోసారి ఇస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న ఈజీఎస్ ఉద్యోగులు, క్షేత్ర సహాయకులు నేటి నుంచి నిరసన బాట పట్టనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ప్రతి నెలా వేతనం అందించాలనే డిమాండ్ నేపథ్యంలో ఎస్ఆర్డీఎస్ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు వినతిపత్రాలు ఇవ్వగా నేడు, రేపు పెన్‌డౌన్, షట్‌డౌన్ చేసి సహాయ నిరాకరణ చేయనున్నారు. అలాగే 2న ప్రజాభవన్, సీఆర్డీ వద్ద శాంతియుతంగా నిరసనలు, 3న మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని సిబ్బంది స్పష్టం చేశారు.
– హనుమకొండ, ఏప్రిల్ 29
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చాలీచాలని వేతనంతో జీవనం సాగిస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూల్ ఫీజులు, వంట సామాన్లు, ఇంటి కిరాయి, కరెంట్ బిల్లు, పాల బిల్లు, నెలనెలా ఈఎంఐలు ఇతరత్రా చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని, కనీసం ఆఫీసుకు వెళ్లేందుకు పెట్రోల్, ఆటో చార్జీలు కూడా లేవంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందోనని వాపోతున్నారు. సంవత్సర కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న అడ్మిన్ బిల్లులు విడుదల చేయాలని మంత్రిని కలిసి విన్నవించుకున్నా ఇప్పటివరకు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పేసేల్ ఇస్తామని, ఫైల్ పెట్టమని ఉన్నతాధికారులను ఆదేశించినప్పటికి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదంటున్నారు. కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో మేన శ్రీనుకు వినతిపత్రాలు అందజేశారు. కాగా సిబ్బంది సమ్మెకు దిగితే గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం కలుగనుంది. అంతేకాక కూలీలు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ప్రతి నెల వేతనం అందించాలనే డిమాండ్ నేపథ్యంలో ఎస్ఆర్డీఎస్ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ విడుదల చేసింది. ఈ క్రమంలో 29న జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేయడం, 30న జిల్లా, మండల కార్యాలయాల్లో ఈజీఎస్ సిబ్బంది ఆఫీసుకు హాజరై ఎంసీసీలో పెన్‌డౌన్, షట్‌డౌన్ ద్వారా సహాయ నిరాకరణ చేయడం. మే ఒకటిన పెన్‌డౌన్, షట్‌డౌన్, 2న ప్రజాభవన్, సీఆర్డీకి వెళ్లి శాంతియుతంగా నిరసనలు, 3న మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించనున్నారు.