రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలు ఉత్తవే అని తేలిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో నాలుగు ఇండోర్ స్టేడియాలు నిర్మించాలన్న ప్రతిపాదన ఎగిరిపోయింది. స్మార్ట్ సిటీ పథకం కింద పనులు చేపట్టందుకు బోర్డు ఆమోదం పొందిన జాబితా బుట్టదాఖలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇండోర్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది.
అప్పటి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో స్థలాలను సైతం గుర్తించారు. గ్రేటర్ ఇంజినీర్లు టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా కొన్నింటికి సింగిల్ టెండర్లు వచ్చాయి. మరికొన్నింటికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు రెండోసారి టెండర్లు పిలిచారు. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇండోర్ స్టేడియాల ప్రతిపాదనలను ఏకంగా పక్కన పడేశారు.
– వరంగల్, సెప్టెంబర్ 28
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని తూర్పు నియోజకర్గంలో ఓ సిటీ, పశ్చిమలో రెండు ప్రాంతాలు, పరకాల పరిధిలో కీర్తినగర్, వర్థన్నపేట నియోజకవర్గంలో జక్కలొద్ది వద్ద ఇండోర్ స్టేడియాలు నిర్మించేందుకు అధికారులు స్మార్ట్ సిటీ ఆమోదం తీసుకున్నారు. ఒక్కో స్టేడియానికి రూ. 5 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం గ్రేటర్ అధికారులు స్మార్ట్ సిటీ పనుల జాబితా నుంచి ఈ ప్రతిపాదనలు తొలగించారు. రూ. 20 కోట్లతో చేపట్టాల్సిన ఇండోర్ స్టేడియాల ప్రతిపాదలను తొలగించడంతో స్మార్ట్ సిటీ నిధులపై ఆశలు సన్నగిల్లాయి. మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పెట్టే అవకాశాలు కూడా లేవు. స్మార్ట్‌సిటీలో ఉన్న ప్రతిపాదనలను తొలగించి, మళ్లీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఇటీవల బల్దియా కౌన్సిల్ సమావేశానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ చెప్పడం కొసమెరుపు.
ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కేటాయించిన నిధులను గ్రేటర్ అధికారులు ఇతర పనులకు మళ్లించారు. ఇందుకోసం స్మార్ట్ సిటీ బోర్డు నుంచి ఆమోదం తీసుకున్నారు. ఈ నిధులను నగరంలో వరదతో నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. స్మార్ట్ సిటీలో ఇండోర్ స్టేడియాలు నిర్మిస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని, తమ ఆశలన్నీ నీరుగారాయని నగర క్రీడాకారులు వాపోతున్నారు.