కేయూలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పడకేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకంపై సాగదీత కొనసాగుతున్నది. డీన్ పోస్టు ఖాళీ అయి 17 రోజులైనా రిజిస్ట్రార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సీనియర్ ప్రొఫెసర్లు తప్పుబడుతున్నారు. పూర్తి స్థాయి డీన్ లేకుండానే పీహెచ్‌డీకి సంబంధించిన కీలక నిర్ణయాలు, ప్రక్రియలను పూర్తి చేయడం చెల్లదని చెబుతున్నారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే డీన్ నియామకంపై జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్‌కు డీన్ పోస్టును ఆలస్యం చేయకుండా, పక్షపాత రహితంగా భర్తీ చేయాలి. గతంలో కొన్ని విభాగాల్లో హెడ్, ఇతర పదవులను అక్రమ పద్ధతిలో నియమించారు. సీనియర్ టీచర్లు ఎవరూ నష్టపోకుండా ఈ డీన్ పోస్టును భర్తీ చేయాలి. భర్తీపై ఇన్చార్జి వీసీ, రిజిస్ట్రార్ వెంటనే దృష్టి సారించాలి’.
కాకతీయ యూనివర్సిటీ సైన్స్ డీన్ నియామకంలో కొంత కాంట్రవర్సీ ఉన్నది. అందుకే జాప్యం జరుగుతున్నది. ఒకో యూనివర్సిటీలో ఒకో రకమైన నిబంధనలు ఉన్నాయి. రిజిస్ట్రార్‌గా నాకు అందరూ సమానమే. డీన్ లేకుండా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ద్వారా పీహెచ్డీ వైవా పూర్తి చేశాం. డీన్ల నియామకం గురించి ఇన్చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్లాం.
కాకతీయ యూనివర్సిటీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతున్నది. కీలకమైన పోస్టుల నియామకంలోనూ ఉన్నతాధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకంపై వివాదం తలెత్తింది. రెండు వారాలుగా ఈ పోస్టు ఖాళీగా ఉన్నా నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. డీన్ లేకుండానే పలు డిపార్ట్మెంట్లలో పీహెచ్డీ సెమినార్లు, వైవా పూర్తవుతున్నాయి. ఒకవేళ డీన్ సెలవుల్లో ఉంటే పరిపాలనా పరంగా ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ తాత్కాలికంగా డీన్‌గా వ్యవహరిస్తారు. ఈ నిబంధనను సాకుగా చూపి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకం విషయంలో కేయూ ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారు. పూర్తి స్థాయి డీన్ లేకుండానే పీహెచ్‌డీకి సంబంధించిన కీలక నిర్ణయాలు, ప్రక్రియలను పూర్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటివి చెల్లబోవని సీనియర్ ప్రొఫెసర్లు అంటున్నారు. కొత్త డీన్‌ను నియమించే వరకు సదరు డిపార్ట్మెంట్లలో సెమినార్లు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఫిజిక్స్, జువాలజీ, బయో టెక్నాలజీ, ఇతర కొన్ని విభాగాల్లో డీన్ లేకుండానే సెమినార్లు, వైవా పూర్తయ్యాయి. పీహెచ్డీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వెంటనే కొత్త డీన్‌ను నియమించాలని కోరుతున్నారు.
ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఉన్న మల్లారెడ్డి గతంలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్‌గా పని చేశారు. మే 31న మల్లారెడ్డి పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంటున్నది. ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా వాకాటి కరుణ బాధ్యతలు చేపట్టి 25 రోజులు గడిచింది. ఇప్పటివరకు సైన్స్ ఫ్యాకల్టీ డీన్‌ను నియమించలేదు. డీన్ పోస్టు ఖాళీ అయి 17 రోజులవుతున్నా ఇప్పటి వరకు భర్తీపై నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తున్నారని సీనియర్ ప్రొఫెసర్లు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ సైన్స్ విభాగాల్లో పనిచేసే వారిలో సీనియర్ ప్రొఫెసర్‌కు డీన్ బాధ్యతలు ఇచ్చే పద్ధతి ఉన్నది. మల్లారెడ్డి తర్వాత సీనియర్‌గా ఉండే ప్రొఫెసర్‌కు ఈ పోస్టును కేటాయించే అవకాశం ఉంటుంది. సీనియారిటీ ఖరారుపైనే అనేక సందేహాలు నెలకొన్నాయి. యూనివర్సిటీలో మొదట అపాయింట్ అయిన తేదీ ఆధారంగా సీనియారిటీ ఖరారు చేయడమా? ప్రొఫెసర్‌గా ఎకువకాలం సర్వీసు చేసిన వారు సీనియర్ అవుతారా అనే దానిపై ఉన్నతాధికారులు తేల్చడంలేదు. గతంలో సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ నియామకంలో ఇలాంటి వివాదం తలెత్తినప్పుడు యూనివర్సిటీలో అపాయింట్ అయిన తేదీ ఆధారంగా సీనియారిటీని ఖరారు చేసి డీన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీలోనూ యూనివర్సిటీలో అపాయింట్ అయిన తేదీ ప్రాతిపదికనే డీన్ పోస్టు భర్తీ చేశారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ భర్తీలోనూ ఇదే పద్ధతిని పాటించారు.
పాత ప్రభుత్వ సర్వీసును కలుపుకుని, మిగిలిన వారి కంటే ముందుగానే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందితే ఆ ప్రొఫెసర్ క్యాడర్ సీనియర్ కాదని, అది ప్రమోషన్ బెనిఫిట్స్ కోసమే ఉపయోగపడుతుందని వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. సీనియారిటీ నిబంధనల ప్రకారం చూస్తే మల్లారెడ్డి తర్వాత సీనియర్ అయిన ప్రొఫెసర్‌కు ఈ పోస్టు దక్కాలి. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్ పోస్టు భర్తీ చేసేందుకు ఇన్చార్జి వీసీకి రిజిస్ట్రార్ పంపే ప్రతిపాదనలపై అందరి దృష్టి ఉన్నది.