హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 12: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 2025 -26 విద్యాసంవత్సరానికిగాను బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ (ఆనర్స్) మొదటి సంవత్సరంలో అడ్మిషన్ కోసం ఈనెల 15,16 తేదీలలో స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడుతుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. స్పాట్ అడ్మిషన్‌కు వచ్చే విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), టెన్త్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్లు 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీని కూడా వెంట తీసుకొనిరావాలన్నారు.
అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు వెనువెంటనే సంబంధిత కోర్సు ఫీజును చెల్లించాలన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.