వరంగల్, డిసెంబర్ 17 (నమస్తేతెలంగాణ):వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులను త్వరలోనే ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముం దుకు పోతున్నది. నిర్మాణ పనుల పర్యవేక్షణను ఆర్‌అండ్‌బీకి అప్పగించగా ఆ శాఖ ఇంజినీర్లు అంచనాలను తయారు చేశారు. పాలనాపరమైన అనుమతులు లభించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో టెక్నికల్ అనుమతులు రూపొందించారు. తొలివిడుత ఆర్అండ్బీ శాఖ రూ.700 కోట్లతో తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి శుక్రవారం సాయంత్రం నుంచే ప్రక్రియ మొదలుపెట్టింది. జనవరి 5 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు స్వీకరించనున్నట్లు ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్‌చీఫ్ ప్రకటించారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు టెక్నికల్ బిడ్ తెరుస్తామని, జనవరి 7న మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధర బిడ్ ఓపెన్ చేస్తామని వెల్లడించారు. ధర బిడ్ తెరిచిన తర్వాతే టెండర్ ఏ ఏజెన్సీకి దక్కిందనేది తేలనుంది. ఏజెన్సీలు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయనున్నందున వాటి వివరాలు జనవరి మొదటి వారం తర్వాతే వెల్లడికానున్నాయి. రెండేళ్ల కాలపరిమితితో పనులు పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ టెండర్ నోటిఫికేషన్లో పేర్కొంది.
మట్టి నమూనాల సేకరణ
వైద్యశాల నిర్మాణం కోసం వరంగల్‌లోని కేంద్ర కారగార స్థలంలో మట్టి నమూనాల సేకరణ కొనసాగుతున్నది. ఈ నెల మొదటి వారంలోనే మట్టి నమూనాల సేకరణ ప్రారంభమైంది. ఐదు పాయింట్ల ద్వారా నమూనాలు సేకరిస్తున్నారు. ఒక్కో పాయింటు ద్వారా 30 మీటర్లు అంటే వంద అడుగుల లోతు యంత్రాలతో డ్రిల్లింగ్ వేసి నమూనాలు సేకరించే పనులు చేపట్టారు. ప్రస్తుతం నాలుగు పాయింట్లలో పనులు జరుగుతున్నాయి. ప్రతి పాయింటులోనూ రాక్ ఉందని తెలిసింది. ఐదో పాయింటులో డ్రిల్లింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. మరో ఐదారు రోజుల్లో ఐదు పాయింట్లలోనూ డ్రిల్లింగ్ పూర్తి కానుంది. ఇక్కడ సేకరిస్తున్న మట్టి నమూనాలను హైదరాబాద్‌లోని ఆర్అండ్బీ శాఖ ల్యాబ్‌ల్లో పరీక్షిస్తారు.