మహబూబాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నా డు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోన్నది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా వి ద్యార్థులు, చిరు వ్యాపారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం కాకముందే రోడ్లు నిప్పుల కొలిమిలా మారుతుండడంతో జనజీవనం స్తంభించిపోతున్నది.
వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అగ్నిధారలు కురుస్తున్నట్లు ఉన్న వాతావరణంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముం దు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. రాబో యే మరో మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని, ఉమ్మడి జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయి దా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తప్పనిసరి అయితే తప్పా బయటకు రావొద్దని, వృద్ధులు, చిన్నారులు, రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురికాకుం డా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వారం రోజులుగా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో మానుకోటతో పాటు డోర్నకల్, మరిపెడ, కేసముద్రం, తొర్రూరు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ప్రజలు బయటకు రావాలంటే బయపడుతున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత వల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది.