రాయపర్తి : రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భారత రాష్ట్ర సమితికి రైతాంగం సంపూర్ణ మద్దతును తెలిపేందుకే సూర్యాపేట జిల్లా నుండి 16 ఎడ్ల బండ్లు స్వచ్ఛందంగా ఈ నెల 17న ఎలుకతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ర్యాలీగా తరలివస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గురువారం ఉదయం రాయపర్తి మండల కేంద్రానికి చేరుకున్న ఎడ్లబండ్లకు మండల గులాబీ శ్రేణులతో కలిసి ఆయన ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ గత 17 నెలల కాంగ్రెస్ పరిపాలన కాలంలో రాష్ట్రంలోని రైతాంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సాగు జలాలు సమృద్ధిగా లేక, అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఆరుగాలం కష్టించి సాగు చేసుకున్న పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలన కాలం రాష్ట్రంలోని రైతులకు సువర్ణ యుగం వంటిదని, అన్నదాతలు ఆనందంగా రోజులు గడిపారని చెప్పారు.
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉద్యమ రథసారథి కేసీఆర్ దృష్టికి తేవాలన్న తలంపుతోనే వరంగల్‌కు సుదూర ప్రాంతమైన సూర్యపేట జిల్లా నుండి అన్నదాతలు స్వచ్ఛందంగా 16 ఎడ్లబండ్లతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎల్కతుర్తి సభకు ర్యాలీగా వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎడ్లబండ్ల ర్యాలీ సాయంత్రం 4 గంటలకు రాయపర్తి నుండి వరంగల్ వైపుకు బయలుదేరుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, లేతాకుల రంగారెడ్డి, అయిత రామ్ చందర్, మహ్మద్ అక్బర్, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, పరుపాటి రవీందర్ రెడ్డి, చందు రామ్ యాదవ్, సతీష్ యాదవ్, చిన్నాల ఉప్పలయ్య, మహ్మద్ అష్రాఫ్, ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్ల స్వామి, అయిత రవి తదితరులు పాల్గొన్నారు.