హనుమకొండ, డిసెంబర్ 9 : ఎన్నో ఏండ్ల కల, అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు.
ఇక్కడ దాస్యం మాట్లాడుతూ కాజీపేట సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదన్నారు. అనేక వర్గాల ప్రజలతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి కోచ్ ఫ్యాక్టరీ సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ సమావేశాల్లోనే విధివిధానాలు ప్రకటించాలని, కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా మార్చాలని, రైల్వే స్ట్రీట్ వెండర్స్‌కు స్టేషన్ ముందు స్థలంలో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే రైల్వే స్టేడియంలో బస్టాండ్ స్థలాన్ని కేటాయించాలని, బోడగుట్ట ప్రజలకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 60శాతం ఉద్యోగాలు ఇవ్వాలని దాస్యం డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రకటించాలని, లేకపోతే అన్ని వర్గాల ప్రజలతో గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నార్లగిరి రమేశ్, కార్పొరేటర్ సంకు నర్సింగ్‌రావు, గబ్బెట శ్రీనివాస్, శిరుమల్ల దశరథం, దువ్వ కనుకరాజ్, ఎండీ అఫ్జల్, కొండ్ర శంకర్, ఎండీ హుస్సేన్, సుంచు అశోక్, బరిగెల వినయ్, రాబర్ట్ జోసఫ్ పాల్గొన్నారు.