హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 16 : గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రజతోత్సవ మహాసభ నేపథ్యంలో 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ, యాదవ్నగర్లలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మొదట పెద్దమ్మగడ్డ జంక్షన్ వద్ద ఉన్న భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేదర్, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల నడుమ పటాకులు కాల్చుతూ ర్యాలీ తీశారు. అనంతరం పెద్దమ్మగడ్డ ఆటోస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ గద్దెపై గులాబీ జెండాను దాస్యం ఎగరవేశారు.
అకడినుంచి ర్యాలీగా వెళ్లి 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌కుమార్ పెద్దమ్మగడ్డలో ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా నాడు టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఒకడిగానే తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారని, 14 ఏళ్లు ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్రం అనే 60 ఏండ్ల కలను సాకారం చేశారని కొనియాడారు. సాధించిన తెలంగాణలో రెండు పర్యాయాలు సీఎంగా చేసిన కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారన్నారు.
16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత అధికమైందని, ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక హామీలు, గ్యారెంటీలు అమలు చేయలేకపోతుందని విమర్శించారు. నాడు ఉద్యమ సమయంలో సైతం పెద్దమ్మగడ్డ నుంచే అనేక కార్యక్రమాలు మొదలుపెట్టామని, ఎలతుర్తి బహిరంగ సభ సన్నాహక సమావేశాలు సైతం పెద్దమ్మగడ్డ నుంచే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయం సామాన్యులకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్ఎస్పై ఆదరణ పెరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మాజీ డివిజన్ అధ్యక్షుడు పేర్ల మనోహర్, యూత్ అధ్యక్షుడు హనుమకొండ బద్రి, దరిగి నిరంజన్, రఘువీర్, కిరణ్, రమేష్, ప్రవీణ్, జయరాం, ప్రశాంత్, అశోక్, అరవింద్, హరీష్, అజయ్, విజయ్, శాంతమ్మ, కోమల, రాజకుమారి, ఉదయాన, పార్వతి, పులోమణి, రోజా, యాదక పాల్గొన్నారు.