హనుమకొండ, ఏప్రిల్ 4 : అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దని పలువరు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల నుంచి హెచ్‌సీయూలో హైదరాబాద్‌కు ఊపిరి అందిస్తున్న అడవిని, వన్యప్రాణులను, వృక్షాలను, నీటి కుంటలను రాత్రికి రాత్రి ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈమేరకు 400 ఎకరాల అడవి విధ్వంసంపై ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ నకలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హాజరై మాట్లాడారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చట్టాలను తుంగలో తొకి కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ అకడి జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే భూముల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై, ఇతరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. తాను పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో కుమ్మకై ఎన్నో ఏళ్ల నాటి చెట్లతో పాటు వన్యప్రాణులు, పక్షుల మనుగడ ప్రశ్నార్థకం చేయడం అత్యంత దారుణమని పర్యావరణవేత్త పిట్టల రవిబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పర్యావరణవేత్త రతన్‌సింగ్ మాట్లాడుతూ సహజ వనరుల సంపద నశిస్తే భవిష్యత్ తరాలకు పరిస్థితి ఏమిటని ఊపిరితిత్తులు దెబ్బతింటే శరీరానికి ఎలా నష్టం కలుగుతుందో అలాగే అడవులు నాశనమైతే వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, నీటి కొరత వంటి సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పౌర సమాజం పోరాడాలని మాజీ మేయర్ రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. సమావేశంలో పర్యావరణవేత్త నిఖిత, అరవింద్ ఆర్య, పరికిపండ్ల వేణు, శ్యామ్, కమలాకర్ స్వామి, విద్యార్థి నాయకులు శరత్, రాకేశ్ యాదవ్, బైరపాక ప్రశాంత్, శ్రీకాంత్‌చారి, వీరస్వామి, అనిల్ పాల్గొన్నారు.