హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28: ఉద్యమనేత కేసీఆర్ పోరాట ఫలితమే నేటి తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రేపు(శనివారం) హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ పోరాట స్ఫూర్తే నేటి తరానికి ఆదర్శమన్నారు.
పదహారేండ్ల క్రితం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే పోరు రణనినాదం ఉద్య మించి స్వరాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో సాధించారు. 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ కేసీఆర్, 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి కొట్లాడి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించందని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ రాష్ర్టంగా నిలిపారన్నారు.
నాటి ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలిపేందుకే దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సంకు నర్సింగరావు, బోయినపల్లి రంజిత్‌రావు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కంజర్ల మనోజ్‌కుమార్, పున్నంచందర్, పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.