హనుమకొండ, మే 23 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కార్మిక సంక్షేమ మహోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం హనుమకొండ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్మిక నాయకుడు నాయిని రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వినయ్ భాస్కర్ వివిధ సంఘాల నాయకులతో చర్చించి పలు తీర్మానాలు చేసారు.
అందులో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆటో కార్మికులకు రూ.12వేలు తక్షణమే అమలు చేయాలనే తదితర తీర్మానాలను ఆమోదించారు. హక్కుల సాధనకు ఈనెల 27వ తేదీ సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వస్తామని వినయ్ భాస్కర్ తెలిపారు. ఈఎస్ఐ, పీఎఫ్ సంస్థల అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 29వ తేదీన ఆటో కార్మికుల క్షతగాత్రుల కుటుంబాలను వినయ్ భాస్కర్ కలుసుకోనున్నట్లు పేర్కొన్నారు.
30వ తేదీన ఆటో కార్మికులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు.
కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఆటో కార్మికులపై రైల్వే అధికారుల వేధింపులను వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేసారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు వెన్నంటి ఉంటానని, కార్మికలందరు సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
జూన్ 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భారత రాష్ట్ర సమితి కార్మిక అనుబంధ విభాగం పాల్గొంటుందని తెలిపారు. అలాగే ఈనెల 31 తేదీన అన్ని కార్మిక సంఘాల ముగింపు సమావేశం జరుగుతుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ సమావేశంలోనాయకులు ఇంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ, మహమూద్ ఇస్మాయిల్, తేలు సారంగపాణి, జి నరహరి, రవీందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రఘు, శివకుమార్, రాజారపు రాజు, శ్రీధర్ రెడ్డి వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.