చిన్నగూడూరు, జూలై 21 : పాతికేళ్ల వయస్సుకే మహాకవిగా దాశరథి కీర్తి గడించాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వమే అతడి ఇంతవాన్ని చేసింది. నిజాం పాలకుల చేతిలో స్వేఛ్చా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగాణా ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చి నిజాం పాలనపై అక్షర శరాలు సందించి ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్యులు.‘ఓ నిజాం పిశాచమా.. కానరాడు.. నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని ఎలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు దాశరథి. నిరంకుశ రాజుల పాలన, పెత్తందార్లు, భూస్వాముల అరాచకాలపై తెలంగాణ ప్రజల కన్నీళ్ళను అగ్నిధారలుగా మలిచి.. రుద్రవీణలు మోగించి.. ప్రజల్లో చైతన్యం నింపిన ధిశాలి ధాశరథి కృష్ణమాచార్యులు. పేదరికంలో ఉన్నా ధైర్యంగా నిశ్చలంగా, నిశ్చింతగా ఉండేవాడు. పేదరికం ఒక భావన మాత్రమేనని కూడు, గూడు, గుడ్డ కొరతే దారిద్య్రం కాదని, సమాజంలో తాను ప్రేమించే వారు, తనను ప్రేమించే వారు లేకపోవడమే నిజమైన పేదరికమంటూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఊపిరి ఉన్నంత వరకు ఆచరించి పోరాడిన వ్యక్తి దాశరథి.
స్వగ్రామంలో జయంతి వేడుకలు..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి.. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన ఆ మహనీయుని జయంతిని రేపు(శనివారం) మహబూబాబాద్ జిల్లాలోని స్వగ్రామమైన చిన్నగూడూరు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకునేందుకు గ్రామస్తులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 22 జూలై 1925న దాశరథి వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు కృష్ణమాచార్యులు జన్మించారు. రామాలయం పక్కనే వీరి నివాసస్థలం ఉండేది. బాల్యంలో విద్యాభ్యాసం కొనసాగుతున్న క్రమంలో దొరల నిరంకుశ విధానాలు, ఆగడాలను సహించని వీరి కుటుంబం గార్లకు అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు తరలివెళ్లింది. ఉస్మానియా యునివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో బీఏ పట్టా పొందారు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. బాల్యం నుంచే కమ్యూనిస్టు భావజాలం కలిగిన దాశరథి అదే రీతిలో సాహిత్యంపై మక్కువ పెంచుకుని సాహితీరంగంలో ఎనలేని కీర్తిని గడించారు. నిజాం పాలకుల చేతిలో హింసకు గురవుతున్న తెలంగాణ ప్రజల కష్టాలను చూసి పీడిత ప్రజల గొంతుకగా మారారు. నిజాం ప్రభువుల నిరంకుశ పాలనలో జాగీర్దారులు, పెంత్తందార్ల పోకడలపై తన అక్షరమే ‘అగ్నిధార’గా తన రచనలే పదునైన ఆయుధంగా మలిచి, రుద్రవీణలు మోగించి తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన కలంయోధుడు దాశరథి. పీడిత ప్రజల విముక్తి కోసం నిజాం పాలకులను ఎదురించి జైలు జీవితం గడిపిన కృష్ణమాచార్యులు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
రచనలు..
రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు దాశరథి కలం నుంచి జాలువారినవి. మారుమూల గ్రామమైన చిన్నగూడూరులో జన్మించి ఎన్నో అవార్డులు, బిరుదులు అందుకుని తెలుగుభాష, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి దాశరథి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా దాశరథికి అప్పటి ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. అంటూ తన రచనలతో నాటి పాల నియంతృత్వ పోకడలపై గలమెత్తి తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన దాశరధి చిరస్మరణీయునిగా నిలిచారు.
దాశరథి చిన్నగూడూరుగా నామకరణం చేయాలి..
దాశరథి సోదరులు జన్మించిన గ్రామం నేడు మండల కేంద్రంగా ఏర్పడింది. దాశరథి చిన్నగూడూరుగా నామకరణం చేయాలని, ఇరువురు సోదరులు కృష్ణమాచార్యులు, రంగాచార్యుల విగ్రహాలను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని మండల వాసులు కోరుతున్నారు. దాశరధి సోదరుల విగ్రహాలను సమైక్యా విద్యాసంస్థల అధినేత అడ్డగోడ నరేశ్ స్థానికులతో కలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చిన్నగూడూరులో ఏర్పాటు చేయించాడు. కాగా, కృష్ణమాచార్యులు కుమారునికి ఐటీ శాఖలో ఉద్యోగం ఇచ్చి, జయంతిని కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దాశరథి జయంతి వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి కళాకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హజరుకానున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.