హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 23 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండోరోజు పురస్కరించుకొని అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించి నీరాజన మంత్రపుష్పాలు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి ఎదురుగా ఉన్న యాగశాలలో లోకకళ్యాణార్థం జగన్మాత రుద్రపరమేశ్వరి యాగం నిర్వహించారు.
సకలజనులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ గణపతి నవగ్రహ రుద్రసహిత సుదర్శన సహిత, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చండీయాగం నిర్వర్తించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. వరంగల్‌లో ప్రముఖమైన వస్త్రసముదాయం సీఎంఆర్ షాపింగ్‌మాల్ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ క్షేత్రాలు దర్శనానికి విచ్చేసిన విశాఖపట్నం వాసులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంకాలం సమయంలో తాడూరి రేణుక శిష్యబృందంచే సాంస్కృత కార్యక్రమాలు నిర్వర్తించారు. వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్బాచ్పాయ్, ఆమె భర్త ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు.
సేవా కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, కోన శ్రీకర్, కిషన్ పాల్గొన్నారు. ఆలయ ఈవో ధరణికోట అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు కూడా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.