ఖిల్లా వరంగల్: మొంథా తుఫాన్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ తహసిల్దార్ ఎండీ ఇక్బాల్‌కు మోంథా తుఫాన్ బాధితులను ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖిలా వరంగల్ మండలంలో అనేక కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ముఖ్యంగా 43వ డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్ పూర్తిగా మునిగిపోవడం వల్ల దాదాపు 350 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పారు. వరద ఎఫెక్ట్ తో ఇప్పటికీ కొన్ని కుటుంబాలు నీటిలోనే జీవనం కొనసాగిస్తూ ఉన్నాయన్నారు.
వర్షం పడినప్పుడు అధికారులు మార్కండేయ నగర్‌ను సందర్శించి ముంపును పరిశీలించారనీ, కానీ ఇప్పటివరకు ప్రభుత్వపరంగా కాలనీవాసులకు ఎలాంటి సహకారం అందలేదని అన్నారు. మార్కండేయ నగర్ కాలనీ వాసులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్య చేపట్టాలన్నారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఎండీ అక్బర్ పాషా, శాఖ సహాయ కార్యదర్శి సుకరి భవాని, సభ్యులు వనం సౌందర్య, జట్టి విజయలక్ష్మి, దుమాల పద్మ, బాశేట్టి రంజిత్, తస్లీం తదితరులు పాల్గొన్నారు.