దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, నవంబర్ 11 : ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా దళితబంధు పథకం అమలవుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షరా గార్డెన్లో దళితులకు అవగాహన సదస్సు, పాలకుర్తి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో పాలకుర్తి నియోజకవర్గంలో 1500 మందికి దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. మండలాల వారీగా మూడు విడుతలుగా ఒక్కో విడుతలో 500 మంది చొప్పున ఎంపిక చేస్తామన్నారు. మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి లాటరీ పద్ధతిలో ఒక్కో క్లస్టర్లో అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇక ఈ పథకంలో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదని, దళితులే కమిటీలుగా ఏర్పడి సమన్వయంతో గానీ, లాటరీ పద్ధతిలో గానీ లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు పొందిన వారు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు మొదటి విడుతలో అవకాశం తీసుకోవద్దన్నారు. మీరు బద్నాం కావద్దు.. మమ్మల్పి బద్నాం చేయొద్దని సూచించారు. వచ్చే బడ్జెట్లో గిరిజనబంధు అమలుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని, దళితబంధు తరహాలోనే గిరిజనబంధు అన్ని గిరిజన కుటుంబాలకు అందుతుందన్నా రు. పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. పాలకుర్తి నియోజక వర్గానికి 3 వేల వ్యక్తిగత ఇండ్లు మంజూరు కాగా, అందులో దేవరుప్పుల మండలానికి 400 కేటాయించినట్లు తెలిపారు. ఇండ్లు లేకుండా ఉండి ఖాళీ జాగ, అర్హత ఉన్న అందరికీ రూ.3లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో మహిళాభ్యున్నతికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మహిళలకు మూడు నెలల శిక్షణ ఇచ్చి, వారికి ఉచితంగా అత్యాధునిక కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన ఉంటుందని, నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాలల భవన సముదాయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేవరుప్పులలో ఆర్డీవో మధుమోహన్, డీఆర్డీవో రాంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకన్న పాల్గొన్నారు.
కేసీఆర్, కేటీఆర్ సహకారంతో టెక్స్టైల్ పార్కు
కొడకండ్ల, నవంబర్11 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన కొడకండ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో దళితబంధు అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.