జనగామ, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): జనగామలో దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘా లు భగ్గుమన్నాయి. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక సందర్భంగా దళిత మహిళా కౌన్సిలర్ మంజులపై కాంగ్రె స్ సభ్యులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి, ధర్నా నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కౌన్సిల్ హాల్లో ఓటింగ్ సమయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో దళిత మహిళ, స్వతంత్ర అభ్యర్థి సందుపట్ల మంజులపై దాడి చేసిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా చేయి పైకెత్తిన దళిత ప్రజాప్రతినిధిపై అనుచితంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేసిన వారికి ప్రభుత్వం అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులపై ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా కౌన్సిలర్ మంజులను చేతులతో తాకు తూ దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మారబోయిన పాండును వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. నిరసనలో దళిత, గిరిజన మున్సిపల్ కౌన్సిలర్లు ఊడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త ప్రవీ ణ్, సజ్జ దుర్గప్రసాద్, దళిత నాయకులు పసుల ఏబెల్, గద్దల నర్సింగరావు, కన్నారపు పరుశరాములు, మల్లిగారి రాజు, వాంకుడోత్ అనిత, తిప్పారపు విజయ్, క న్నారపు శివశంకర్, ఊడుగుల సాగర్, కందుకూరి ప్రభాకర్, తాళ్లపల్లి సురేశ్, బొట్ల శంకర్, తిప్పారపు అనిల్, తోట సునీల్, కొమ్ము రాజు, బక సునీల్, గద్ద సాయికుమార్, గుజ్జిక రాజు, ఇరుగు యాకన్న పాల్గొన్నారు.