నర్సంపేట రూరల్/నల్లబెల్లి/ఖానాపురం/చెన్నారావుపేట/నెక్కొండ, జనవరి 9 : దళితబంధు పథకాన్ని కొనసాగించి దళిత కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధును కొనసాగించడంతో పాటు ఒక్కో లబ్ధిదారుకు రూ.12లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నర్సంపేట డివిజన్లోని లబ్ధిదారులు ఆయా మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇప్పటికే రెండో విడుత ప్రొసీడింగ్‌లు ఇచ్చారని వారందరికీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేయడంతో పాటు పాడి గేదెల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు.
బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవాలని దళితబంధు లబ్ధిదారులు జమాండ్ల చంద్రమౌళి, బరిగెల కిశోర్‌కుమార్, చిన్నపెల్లి నర్సింగం కోరారు. ఈమేరకు నర్సంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వందలాది మంది లబ్ధిదారులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీటీ కన్నె రాజ్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో లబ్ధిదారులు ఉల్లేరావు సాంబయ్య, బందెల రాజమౌళి, బరిగెల నవీన్, బరిగెల శ్రీకాంత్, బరిగెల చింటు, కుక్కమూడి శంకర్, జన్ను కొమురుమల్లు, కొంకటి రవీందర్, మామిడాల మధు, పెరుమాండ్ల చిన్నకట్టస్వామి, జమాండ్ల రాజేందర్, శ్రీకాంత్, బరిగెల ప్రేమ్‌చంద్, కొయ్యల సుమన్ పాల్గొన్నారు. నల్లబెల్లిలో దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి భట్టు సాంబయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సునీతకు వినతిపత్రం అందజేశారు.
రెండో విడుతలో 147మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పరికి నవీన్, జన్ను జయరాజ్, అడ్డ రాజు, పరికి రత్నం, బొట్ల పవన్ పాల్గొన్నారు. ఖానాపూరంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీవో సుమనావాణికి లబ్ధిదారులు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ కారణంగా దళితబంధు లబ్ధిదారులకు ఖాతాల్లో డబ్బులు జమచేయలేదని, ప్రభుత్వం వెంటనే జమ చేయాలని సర్పంచ్ గొర్రె కవిత, దాసరి రమేశ్ డిమాండ్ చేశారు. ఇక్కడ నాగరాజు, సురేశ్, కొమురమ్మ, వెంకన్న, దావీద్, బాబు, ప్రభాకర్, లక్ష్మి, శ్రీను పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమను రెండో విడుతలో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ చెన్నారావుపేటలో సాదు నర్సింగరావు, యాకూబ్, బాలు, కుమారస్వామి, రాజు, సందీప్, తదితరులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.