రైతు ప్రభుత్వమని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. రైతులను అదును చూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుతున్న రేవంత్‌రెడ్డి సరారు.. తాజాగా జీలుగ విత్తన ధరలు పెంచి మరో పిడుగు వేసింది. ఏకంగా రెండింతలు ధర పెంచేసి రైతులపై మోయలేని భారం వేసింది. రైతులు ఏటా భూమి సారవంతానికి, పంట దిగుబడి కోసం పొలాల్లో జీలుగ విత్తనాలను చల్లుకొని ఏపుగా పెరిగిన తర్వాత కలియదున్ని ఎరువుగా మార్చి నేలను సాగు కోసం సిద్ధం చేసుకుంటారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30కిలోల బస్తా కేవలం రూ,1124కే అందించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4,275లకు పెంచి సబ్సిడీపై రూ.2137లకు అందిస్తూ రైతులపై ఆర్థిక భారం మోపుతున్నది. మొన్నటిదాకా సాగునీటి కోసం అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనక వరదపాలై ఆగమయ్యామని. ఇప్పుడు మళ్లీ జీలుగ విత్తన ధర పెంచి నిండాముంచుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
– పెద్దవంగర/నల్లబెల్లి, మే 19
రెండింతలైన ధర
ఆరుగాలం కష్టపడే రైతులపై కాంగ్రెస్ సరార్ చిన్నచూపే చూస్తున్నది. ఇప్పటికే సాగును భారంగా మార్చిన ప్రభుత్వం జీలుగు విత్తన ధరలు పెంచి వారిపై ఆర్థికంగా కుంగదీస్తున్నది. 30 కిలోల బస్తా ధర సుమారు రెండింతలు పెంచడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే భారీగా ధరలు పెంచడంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని పథకాలకు రైతులను దూరం చేసింది.
రైతుభరోసా, రుణమాఫీ సహా ఏ పథకాన్ని కూడా సంపూర్ణంగా అందరికీ అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ధర ఒకసారిగా పెంచడంపై పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం సరఫరా చేసే జీలుగ విత్తనాల సంచిలో సగం వరకు పుచ్చులు ఉంటాయని పలువురు వాపోయారు. జీలుగ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గత ఏడాది మాదిరిగానే 30 కిలోల బస్తాను పాత ధరకే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ సరారు స్పందించకపోతే అన్నదాతల ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో చూపిస్తామని తెగేసి చెబుతున్నారు. అన్నదాతను ఆదుకుంటామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ సరారు ఇప్పటికైనా జీలుగు విత్తనాల ధరను తగ్గించాలని కోరుతున్నారు. జీలుగ విత్తనాల ధర పెంచిన ప్రభుత్వం సొసైటీలు, అగ్రోస్ కేంద్రాల ద్వారా అన్నదాతలకు సబ్సిడీపై అందిస్తున్నారు. 30 కిలోల జీలుగు విత్తనాల ధర రూ.4275 రూపాయలుగా నిర్ణయించారు. 50శాతం సబ్సిడీపై రైతులకు రూ. రూ.2137.50 రూపాయలకు అందజేస్తున్నది. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్‌ను సొసైటీ కార్యాలయాల్లో చూపించి సబ్సిడీపై విత్తనాలను తీసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రజాపాలనలో పచ్చిరొట్ట సాగు ప్రశ్నార్థకమేనా?
ప్రజాపాలనలో పచ్చిరొట్ట సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలు నకిలీ మందులకు అనుమతులు ఇవ్వడంతో భూసారం దెబ్బతిని దిగుబడులు రాక తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. అలాగే కాంగ్రెస్ వచ్చాక దిగుబడులు తగ్గినప్పటికీ పండిన పంటకు సైతం ఆశించిన ధర లేదు. మిరప(తేజ) పంటకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాకు రూ.22వేలు పలికితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇదే క్వింటాకు రూ.7వేల నుంచి 8వేలు ధరకే పరిమితమైంది. పంట పెట్టుబడితో పాటు కూలీలకు చెల్లిస్తున్న డబ్బులతో నేడు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం పునరాలోచించి జీలుగ విత్తనాల ధరను తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర అందించాలి.
– నాగంపల్లి కిరణ్‌కుమార్, చపాటా మిర్చి రైతు, రేలకుంట, నల్లబెల్లి మండలం
ఇంత ధరైతే కొనుడెట్ల?
జీలుగ విత్తనాల ధరను ఇంత పెద్ద మొత్తంలో పెంచడం సరైనది కాదు. ఇది రైతులపై ఆర్థిక భారం మోపడమే. అంత ధర పెట్టి రైతులు ఎలా కొంటారు. ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. ధరను అందుబాటులోకి తీసుకురావాలి.
– దేశబోయిన రాజు, కొరిపెల్లి గ్రామ యువ రైతు, పెద్దవంగర
ఎందుకంత పెంచినట్టు?
విత్తన ధరను పెంచి రైతులపై భారం మోపింది. ఇప్పటికే ఖర్చులు తడిసి మోపెడవుతుంటే ప్రభుత్వం జీలుగ విత్తనాల ధర పెంచి రైతులపై మరో పిడుగు వేసింది. ఇది కచ్చితంగా రైతులను మోసం చేయడమే. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
– రెడ్డబోయిన గంగాధర్ యాదవ్, పెద్దవంగర