హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 13 : బతుకమ్మ, దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలకు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పలేదు. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని బస్టాండ్లకు ఆదివారం తరలిరావడంతో అవి ప్రయాణికులతో నిండిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌కు కేంద్ర బిందువైన హనుమకొండ బస్టాండ్ కిటకిటలాడింది.
ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ రూట్లో ప్రయాణికులు పోటెత్తారు. సోమవారం విధుల్లో చేరేందుకు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు హైదరాబాద్ వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వచ్చిన బస్సుల్లో ఎక్కడానికి, సీటు దక్కించుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్ రూట్లో సుమారు 550 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇవికాకుండా హైదరాబాద్ మీదుగా బెం గళూర్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, శ్రీశైలం, మిర్యాలగూడ తదితర దూరప్రాంతాలకు ఆన్లైన్ రిజర్వేషన్ సర్వీసులను నడిపారు. అయితే రద్దీని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి హైదరాబాద్‌కు బస్సులు నడపడంతో ప్రజ లు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం, భూపాలిపల్లి, నర్సంపేట, తొర్రూరు, పాలకుర్తి, ధర్మసాగర్, వరంగల్‌సిటీ ప్రయాణికులు బస్సుల కోసం రోడ్ల మీద నిరీక్షించారు.