తాడ్వాయి, జనవరి 30 : నేల ఈనినట్లు జన సందోహం.. మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరిన భక్తులతో మేడారం పోటెత్తింది. శుక్రవారం సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు ప్రధాన గద్దెలపై ఆసీనులైన క్షణాన నేల కనిపించనంతగా జనం తరలివచ్చింది. జంపన్నవాగు ఇసుకేస్తే రాలని విధంగా మారింది. వన దేవతల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తజనం భారీగా తరలిరావడంతో అమ్మల సన్నిధిలో జనసమ్మర్ద దృశ్యం ఆవిష్కృతమైంది.
జాతర నుంచి పది కిలోమీటర్ల మేర భక్తుల విడిది దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా , మరో వైపు గద్దెల వద్దకు లక్షలాదిగా జన ప్రవాహం వస్తూనే ఉంది. మేడారం జనం ప్రభంజనమైంది. దేవతలందరూ గద్దెలపై ఆసీనులు కావడంతో తల్లుల దర్శ నానికి భక్తులు పోటెత్తారు. మేడారానికి దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో గుడారాలు ఏర్పా టు చేసుకున్న వారు ఇంటిల్లిపాదితో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నెత్తిన బంగారం మూటలు, చంకన పిల్లల్ని ఎత్తుకొని భక్తులు తమకెన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తల్లుల దర్శనం ముందు అవన్నీ దిగదుడుపేనని భావించా రు. రద్దీ విపరీతంగా పెరగడంతో వీఐపీ, వీవీఐపీ సందర్శకుల కోసం జారీ చేసిన ప్రత్యేక పా సులు కలిగి ఉన్న క్యూలను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి మహా జాతరకు శుక్రవారం వరకు కోటి 50 లక్షల మంది భక్తులు తల్లుల్ని దర్శించు కున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయ నుంది. సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనుగుండ్ల, గోవిందరాజులు కొండాయికి వెళ్లిపో తారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయల ప్రకారం వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వ హించి తల్లుల్ని తిరిగి ఎక్కడి నుంచి తోడ్కోని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు.
వాజేడు : మేడారం సమ్మక్క,సారలమ్మ తల్లులను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శిం చుకుని ఎత్తుబెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారత్ వెన్ ఓవెన్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్త్తాత్రేయ, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.