తాడ్వాయి, జనవరి 4 : వనదేవతలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం జనారణ్యంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి 2 లక్షలకు పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చారు. దీంతో జాతర పరిసరాలు, పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, తలనీలాలు సమర్పించిన అనంతరం తల్లులను దర్శించుకున్నారు.
భక్తుల రద్దీ పెరగడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి క్యూలో దర్శనాలకు అనుమతించారు. అయితే పోలీసులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భారీ యంత్రాలతో అభివృద్ధి పనులు జరుగుతుండడం, మంత్రుల పర్యటన ఉండడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించడంతో గద్దెలకు చేరేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు.