ఖానాపురం, డిసెంబర్ 24: గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురిసిన వడగండ్ల వానకు నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి, మక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్ల పరిహారం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది హాజరయ్యారు. ముందుగా సభకు గైర్హాజరైన అధికారులపై పెద్ది ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఏఈ, ఐబీ డీఈ, ఏఈలు, సొసైటీ సీఈవో, ఏపీవో, ఎంఈవో, ఏఎస్‌డబ్ల్యూవో, మత్స్యశాఖ అధికారులు సభకు ఆలస్యంగా వచ్చారు. వారిపై కలెక్టర్‌కు నివేదిక అందజేసి చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్చించే వేదిక సర్వసభ్య సమావేశమన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పరిహారం..
వడగండ్ల వాన బాధితులకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నష్టపరిహారం అందజేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం పరిహారం అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తంలో 75 శాతం నష్టపరిహారం నర్సంపేట నియోజకవర్గానికే అందినట్లు వెల్లడించారు. ఖానాపురం మండలానికి 560 మంది రైతులకు సంబంధించి 202 హెక్టార్లలో పంటలు నష్టపోగా, రూ. 30 లక్షల పరిహారం మంజూరైనట్లు వివరించారు. వ్యవసాయాధికారుల వద్ద ఉన్న రైతుబంధు ఖాతాల్లోనే నష్టపరిహారం ఆన్లైన్ విధానంలో జమవుతుందని తెలిపారు. మండలంలో మంజూరైన హెల్త్ సబ్‌సెంటర్ల భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌లు, అధికారులను ఆదేశించారు. స్థలాలు లేనిచోట ఇతర గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మండలానికి రూ. 3.27 కోట్ల విలువైన సీసీరోడ్లు మంజూరైనట్లు తెలిపారు. వాటిని నెల రోజుల్లో పూర్తి చేసుకోవాలని కోరారు.
ప్రతి తండాకూ రోడ్డు సౌకర్యం
మండలంలో రోడ్డు సౌకర్యం లేని ప్రతి తండాకు రూ. 9.50 కోట్లతో బీటీరోడ్డు మంజూరు చేశామని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని ఎమ్మెల్యే పెద్ది వెల్లడించారు. మూడు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. ఖానాపురంలో పోచమ్మగుడి వరకు బీటీరోడ్డును మంజూరు చేశామని, బుధరావుపేట జీపీ కార్యాలయంలో అదనపు గదులకు రూ. 20 లక్షలు, ధర్మారావుపేటలో గ్రంథాలయానికి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో కేటాయించిన పనులను పూర్తి చేస్తేనే కొత్త పనులు ఇస్తానని స్పష్టం చేశారు.
ఆశ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలి
అనంతరం వైద్య శాఖపై జరిగిన చర్చలో నాజీతండాలో ఆశ కార్యకర్త మెడలో స్టెతస్కోప్ వేసుకొని ఎంబీబీఎస్ వైద్యరాలినని నమ్మిస్తూ తండావాసులను ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తున్నదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బాలకిషన్ ఎమ్మెల్యేను కోరారు. విద్యుత్, ఈజీఎస్, మిషన్ భగీరథ శాఖలపై జరిగిన చర్చలో బుధరావుపేట సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథలో చేసిన పనులకు మూడేళ్లుగా ఏఈ బిల్లులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనులు చేసిన కొందరు కూలీల డబ్బులు ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడం లో పేమెంట్ రాలేదని రాగంపేట సర్పంచ్ ఐలయ్య అన్నా రు. అనంతరం పాకాల ఆయకట్టు పరిధిలోని పంట కాల్వలను సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న ఎమ్మెల్యే పెద్దికి సర్పంచ్‌లు శాలువా కప్పి సన్మానించారు. మండల సభలో ఎంపీడీవో సుమనావాణి, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.