రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది. కొందరికి మాత్రమే లబ్ధిచేకూరగా మాఫీ కాని వారు సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా పీఏసీఎస్‌ల పరిధిలో ఉన్న రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల్లో చాలామంది అర్హులున్నా వారి పేర్లు జాబితాలో గల్లంతుకావడం అనుమానాలకు తావిస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో సహకార సంఘాల లెక్కలను పరిశీలిస్తే సుమారు 70శాతం మందికి రుణమాఫీ కాలేదని తెలుస్తోంది. దీంతో వారు శనివారం చాలాచోట్ల అటు సొసైటీలు, బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీసిన రైతులు తమకెప్పుడు మాఫీ అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జూలై 20(నమస్తే తెలంగాణ)/ నర్సంపేట/ నెక్కొండ/ వర్ధన్నపేట/
నర్సింహులపేట/ ఖానాపురం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్షలోపు రుణమాఫీ ఎప్పుడవుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా జిల్లాల్లోని పీఏసీఎస్‌ల పరిధిలోని రైతుల్లో 70శాతం మందికి రుణమాఫీ జరగలేదు. ఇతర బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని అర్హతలున్నా తమ పేరు లిస్టులో లేకపోవడంతో బ్యాంకులు, సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తమ రుణం మాఫీ అవుతుందో? లేదో? అని ఆవేదనకు గురవుతున్నారు. వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట సొసైటీలో నర్సంపేట, నెక్కొండ, గూడూరు, చెన్నారావుపేట, ఖానాపురం మండలాలకు చెందిన 20 గ్రామాల పరిధిలోని 9,626 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రూ. రెండు లక్షల మాఫీలో 5,768 మంది సభ్యులకు అర్హత ఉండగా, మొదటి విడుత రూ. లక్ష మాఫీలో 4వేల మంది రైతుల పేర్లు రావాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేదు.
నెక్కొండ : నెక్కొండ పీఏసీఎస్ పరిధిలో రూ. లక్షలోపు రుణాలున్న 1,222 మంది రైతుల జాబితాను పంపించగా 564 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం ఒక్క రోజే 50 మంది రైతులు రుణాల వివరాల కోసం ఏఈవోలను సంప్రదించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 పీఏసీఎస్‌లుండగా వాటిలో 10,931 మంది రైతులు రూ. లక్షలోపు రుణం తీసుకున్నారు. ఇందులో 2,863 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మహదేవ్పూర్ మండలంలో 434 మంది రైతులకు 171 మం దికి, మల్హర్ మండలంలో 590 మందికి 190, చిట్యా ల మండలంలో 1134 మందికి 291, కాటారంలో 1157 మందికి 428, మహాముత్తారంలో 659 మం దికి 266, జంగేడులో 900 మందికి 346, చెల్పూర్ లో 382 మందికి 202, గణపురంలో 2919 మందికి ఏ ఒక్కరికీ రుణమాఫీ జరగలేదు. అలాగే రేగొండ మండలంలో 1,576 మందికి 739, మొగుళ్లపల్లిలో 1,180 మందికి 290 మాత్రమే రుణమాఫీ జరిగింది.
ప్రభుత్వం రూ. లక్షలోపు రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేసినట్లు మాటల్లో చెప్పడం తప్ప అమలు చేయడం లేదు. నాకున్న ఎకరంన్నర భూమిలో వరి సాగు కోసం కొండాపురం సిండికేట్ బ్యాంకులో గత ఏడాది రూ.50 వేల రుణం తీసుకున్నా. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ లిస్టులో నా పేరు లేకపోవడంతో చాలా బాధపడ్డాను. నాకు లేని అర్హత ఏంటని కుంగిపోయాను. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి లిస్టు రాలేదని చెబుతున్నారు. అసలు నాకు రుణమాఫీ అవుతదో? కాదో? తెలవడం లేదు. ప్రభుత్వం మాత్రం రూ. లక్షలోపున్న రుణాలన్నింటినీ మాఫీ చేశామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఒక పక పంట సాగు పనులు పూర్తవుతున్నా రైతుభరోసా డబ్బులు రాక, మరోపక రుణమాఫీ కాక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని నిద్రపట్టడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని అర్హతలున్న నా రుణాన్ని మాఫీ చేయాలని కోరుతున్నా.
– మధుకర్, రైతు, గుర్తూరు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా
నేను పాలకుర్తి ఏపీజీవీబీ బ్యాంక్‌లో రూ. 80 వేలు లోన్ తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలిసి బ్యాంక్‌కు వెళ్తే అధికారుల వద్ద ఉన్న లిస్టులో నా పేరు లేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొంత మాఫీ చేశారు. రెన్యువల్ కూడా చేసుకున్నాను. రుణమాఫీపై అంతా అయోమయంగా ఉంది. జాబితాలో లేని రైతులకు రుణమాఫీ జరుతుందా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
– గాదె మల్లారెడ్డి, రైతు, పాలకుర్తి, జనగామ జిల్లా
నేను, నా భర్త నర్సయ్య ఇద్దరం మాకున్న వ్యవసాయ భూముల పట్టా పాసు పుస్తకాలను రాయపర్తిలోని ఎస్బీఐలో పెట్టి పంట రుణం తీసుకున్నాం. బ్యాంకు సిబ్బంది చెప్పినప్పుడల్లా రుణాలను రెన్యువల్ చేసుకుని వడ్డీ డబ్బులు చెల్లించినం. కానీ ఇప్పుడు రుణాలమాఫీ రావడంతో బ్యాంకర్లు చెప్పే సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నా భర్త నర్సయ్య పంట రుణం రెన్యువల్ అయినందువల్ల మాఫీ వర్తిస్తుందని, నీ క్రాప్ లోన్ ఇప్పటి వరకు రెన్యువల్ చేసుకోకపోవడంతో మాఫీ రాదు అంటూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రతిసారి మేము ఇద్దరం బ్యాంకుకు వచ్చి పంట రుణాలు రెన్యువల్ చేసుకుని వడ్డీలు చెల్లించాం. కానీ గీ సర్కారు గిట్ల మమ్మల్ని గోస పుచ్చుకుంటాంది.
– మామిండ్ల రాణమ్మ, కాట్రపల్లి, రాయపర్తి