మహబూబాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఇటీవల వచ్చిన వరదలకు కొట్టుకొచ్చి పంట పొలాల్లో వేసిన ఇసుకమేటలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. మేటల తొలగింపు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరదలకు 16,547 మంది రైతులకు చెందిన 14,247 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. పంటల వారీగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటే వరదల వల్ల జిల్లాలో 15 వేల నుంచి 20 వేల ఎకరాల్లో వేసిన ఇసుక మేటలు, రాళ్లు తొలగించలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు వరదలకు పంటలు కొట్టుకుపోయి పెట్టిన పెట్టుబడి, కూలీల ఖర్చులన్నీ నేలపాలు కాగా, మేటలు తొలగించాలంటే మళ్లీ రూ. లక్షల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవేళ మేటలు తొలగించినా నేల స్వభావం మారి పంటలు పండుతాయో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, మరి ఇసుక మేటలు తొలగించేందుకయ్యే ఖర్చులు ఎవరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నర్సింహులపేట, సెప్టెంబర్ 26 : ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోతే కొందరికే పైసలిస్తరా? అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలోని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన అనంతరం ఈ నెల 4న తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ అఖిల్ గ్రామంలోని జెట్టి యాకయ్య, మందుల యాకన్న ఇండ్లను పరిశీలించారు. తీరా నష్టపరిహారం జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిన ఇండ్లను పరిశీలించామని, గతంలో కూలిన వాటిని వారు చూపించారని, అందుకే అ ర్హత కలిగిన 17 ఇండ్లకు రూ. 16,500 చొప్పున రూ. 2,80,500 పరిహారం వచ్చిందన్నారు. పడమటిగూడెంలో 2, రామన్నగూడెంలో 2, జయపురంలో 4, బాసుతండా లో 4, వస్రంతండాలో 2, వంతడపల, జగ్గుతండా, బొజ్జన్నపేటల్లోఒక్కొక్కటి చొప్పునడబ్బులువచ్చినట్లు తెలిపారు.
వర్షాలతో నా ఇల్లు కూలిపోయింది. నష్ట పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న. అధికారులు వచ్చి నా ఇల్లు చూసి వెళ్లారు. ఆ సమయంలో నాకు భరోసా ఇచ్చి పరిహారం వచ్చేలా చూస్తామని చెప్పారు. కానీ, పరిహారం లిస్టులో నా పేరు రాలేదు.
– మందుల యాకన్న, జయపురం, నర్సింహులపేట
గత 25 రోజుల కింద ఆకేరు వాగు వరద వల్ల భూమిపై ఉన్న సారవంతమైన నేలతో పాటు నా రెండెకరాల మిర్చి తోట కొట్టుకుపోయి ఇసుక మేటలు వచ్చినయ్. రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. నాలుగైదు ఏళ్లు వ్యవసాయానికి భూములు పనికిరావు. సారవంతమైన చెరువు మట్టి పోయడానికి సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుంది. వ్యవసాయ అధికారులు పదేపదే సర్వే నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదు. ఇప్పటికైనా మాకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-ధరావత్ కుమార్, రైతు, దుబ్బగడ్డ తండా