వర్ధన్నపేట, మే 6 : అన్నదాతలు అధైర్యపడొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసినా కూడా పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం, పంట తడుస్తుండడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అధికారులతో సమీక్ష నిర్వహించి, ధాన్యం తడిసి రంగు మారినా కూడా మద్దతు ధరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అందుకని ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతుల ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. రైతులు ఏ మాత్రం అధైర్య పడొద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వ్యవసాయరంగ ప్రగతి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా నీరు అందించడంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాక అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం హెక్టారుకు రూ.3వేలు మాత్రమే పరిహారంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తుంటే కొన్ని పార్టీల నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాయకులను రైతులు నిలదీయాలని కోరారు.
మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దు : డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని మిల్లులకు పంపిన తర్వాత తూకం విషయంలో మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయవద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు కోరారు. కేంద్రాల్లో బస్తాకు రెండు కిలలో వరకు తగ్గించి లారీలలో లోడుచేసి మిల్లులకు పంపిస్తున్నట్లు తెలిపారు. అయినా, మిల్లర్లు తూకం తక్కువ వస్తుందని కోతలు విధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడి మిల్లర్లకు సూచనలు చేయాలని ఎమ్మెల్యే రమేశ్‌ను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు తూళ్ల కుమారస్వామి, చొప్పరి సోమయ్య, సిలువేరు కుమారస్వామి, నాంపెల్లి వెంకన్న పాల్గొన్నారు.