జనగామ చౌరస్తా, నవంబర్ 20 : ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం జనగామ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టులను వచ్చే మార్చిలోపు ఏరి వేస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశిస్తే, అమిత్ షా అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. డెడ్ లైన్లు పెట్టి మరీ మావోయిస్టుల ప్రాణాలు తీయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్ కౌంటర్లను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. లొంగి పోవడానికి వచ్చిన మావోయిస్టులను కేంద్ర బలగాలు పట్టుకొని కాల్చి చంపుతున్నారని విమర్శించారు. ఏ వ్యక్తిని కూడా చంపే అధికారం ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ లేదన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత తిరుపతిని న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లపై న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని సూచించారు. దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాజిక, రాజకీయ అసమానతలు ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయని తెలిపారు. పోరాటాలు, ఉద్యమాలను ఆపడం మోదీ కాదు కదా తను తాత వల్ల కూడా కాదని ఎద్దేవా చేశారు. నియంత హిట్లర్ లాంటి వాళ్లనే మట్టికరిపించిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలను మతపరంగా, రాజకీయంగా బిజెపి సర్కార్ ఉపయోగించుకుంటుందని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద చర్యను బీహార్ ఎన్నికకు ముందు బీజేపీ ఉపయోగించుకోవడం దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, రాపర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.