ఖిలావరంగల్, డిసెంబర్ 29 : గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెవాసులు ధర్నా చేశారు. అక్కడే బైఠాయించి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జీ నాగయ్య, హనుమకొండ జిల్లా కార్యదర్శి జీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో వేలాది మంది ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఏళ్లు గడుస్తున్నా పాలకులు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నా సర్కారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని, పేదలకు మాత్రం నిలువ నీడ కోసం గుడిసెలు వేసుకుంటే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. మొంథా తుఫాన్ వల్ల రైతులు, పేదలు తీవ్ర నష్టానికి గురయ్యారని, వారికి తగిన ్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ అధికారులు కొందరికి మాత్రమే ఇచ్చారని, ఇంకా అనేక కాలనీల్లో సర్వే చేయలేదని, వెంటనే చేపట్టాలన్నారు.
శాశ్వత పరిషారంగా అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటా యించాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులకు హౌస్ హోల్డర్ నంబర్లకు బదులు ఇంటి యజమాని పేరుతో నంబర్లు ఇవ్వాలన్నారు. స్లమ్స్‌లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయా కలెక్టరేట్లలో అందజేశారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుకయ్య, బొట్ల చక్రపాణి, రాగుల రమేశ్, జిల్లా కార్యదర్శి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.