వరంగల్ చౌరస్తా: ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ, గిరిజన ప్రజల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రజా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో న్యూమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు ప్రజా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిని, అడవి సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం హయాంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 8న ఉదయం 11గంటలకు ప్రజా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్ర కమిటీ తీర్మానం చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వర్రావు, బన్న నరసింగం, మన్ను కరుణాకర్, ఎండీ అక్బర్, బండి చంద్రమాళి, తదితరులు పాల్గొన్నారు.