నయీంనగర్, జూలై 22 : కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే మణిపూర్లో గిరిజన మహిళలపై అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. మణిపూర్ ఘటన బాధితులకు సంఘీభావం ప్రకటి స్తూ దేశవ్యాప్తంగా సీపీఐ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాడులు నిరంతరం ఎకువవుతున్నాయన్నారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ ప్రజా సంక్షేమాన్ని మరిచిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు పోరాడాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, మండ సదాలక్ష్మి, ఊటూరి రాములు, కర్రె లక్ష్మణ్, మునగాల భిక్షపతి, నకిర్తే ఓదెలు, సాంబయ్య పాల్గొన్నారు.