మహబూబాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : మానుకోట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్తో సీపీఐ పొత్తు కుదుర్చుకున్నట్లు గులాబీ పార్టీ మున్సిపల్ ఇన్చార్జి దాస్యం వినయ్‌భాస్కర్ వెల్లడించారు. గురువారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాసర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో మానుకోటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు సీపీఐతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఈ రోజున మానుకోటలో సీపీఐకి ఆ పార్టీ ఎమ్మెల్యే మురళీనాయక్ వెన్నపోటు పొడిచాడని ఆరోపించారు. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, ఇందులో 18, 23 వార్డులు సీపీఐకి కేటాయించామని, ఇకడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తప్పుకుంటున్నారని వెల్లడించారు.
మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్కు ఆ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు వివేక కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మిత్రపక్షానికి ద్రోహం చేసిన ఎమ్మెల్యే రేపు ప్రజలకు మోసం చేయడమనేడానికి గ్యారెంటీ ఏముందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, సీపీఐ కూటమిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము ఏడు వార్డుల్లో పోటీ చేస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు భరత్ కుమా ర్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, కేసన్ రెడ్డి, నల్లాని నవీన్ రావ్, మార్నేని వెంక న్న, నాయిని రంజిత్ కుమార్, సీపీఐ నాయకులు పెరుగు కుమార్, నవీన్, వెంకన్న, యాక లక్ష్మి, శ్రా వణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క అభివృద్ధి పనీ చేయలేదన్నారు. ఏ కాలనీలో చూసినా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సారి ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి 36 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.