సుబేదారి, ఏప్రిల్ 1 : సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ఈస్ట్ జోన్ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పెండింగ్ కేసుల విచారణను వెంటనే పూర్తి చేయాలని, కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేరస్తులకు తగిన శిక్షపడేలా దర్యాప్తు చే యాలన్నారు. గంజాయి, లైంగికదాడుల కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు వేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలన్నారు. కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు రాత్రి 10 గంటలు దాటితే మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏసీపీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలన్నారు. సమావేశంలో డీసీపీలు రవీందర్, బారి, ట్రైనీ ఐపీఎస్ అధికారి అంకిత్ శుభంనాగ్ పాల్గొన్నారు. కాగా, మామునూరులోని పోలీసు శిక్షణ కళాశాలను సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న 306మంది ఏఆర్ మహిళా పోలీసులతో మాట్లాడారు. సీపీ వెంట పీటీసీ ఇన్చార్జి, అడిషనల్ ఎస్పీ రాగ్యానాయక్, అసిస్టెంట్ కమాండెంట్ రాజేశ్, అనిల్ ఉన్నారు. అలాగే, హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌లో ఉద్యోగ విమరణ పొందిన అధికారులు, సిబ్బందిని సీపీ సన్మానించారు. కార్యక్రమంలో డీసీపీ బారి, అదనపు డీసీపీలు రవి, సంజీవ్, సురేశ్‌కుమార్, ఏవో రామకృష్ణ పాల్గొన్నారు.