గూడూరు, మార్చి 14 : తల్లిదండ్రులు హత్యకు గురైన విష యం టెన్త్ పరీక్ష రాసిన అనంతరం తెలియ డంతో బాలిక విషాదం లో మునిగిపోయిన ఘటన మహబూబా బాద్ జిల్లా గూడూరు మండలం గన్యచకృ తండాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గన్యచకృతండా గ్రామానికి చెందిన గిరిజన దంపతులు ధరావత్ మంగమ్మ(40), సోము(45) కొంతకాలం క్రితం ఉపాధి కోసం హైదరాబాద్లోని పటాన్ చెరువు సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేస్తున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వివాహం చేయగా రెండో కూతురు వసంత గూడూరులోని బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో శుక్రవారం రోజు సాయంత్రం మంగమ్మ, సోములు పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగా వీరిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా నేటికీ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
తల్లిదండ్రుల మరణవార్త తెలియని నేపథ్యంలో వసంత శనివారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసి సంతోషంగా హాస్టల్కు చేరుకుంది. ఇంతలో తల్లిదండ్రులు హత్యకు గురైన విషయాన్ని బంధువులు, వార్డెన్ తెలుపడంతో వసంత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. మంగమ్మ, సోములు మృతదేహాలు శనివారం రాత్రి వరకు స్వగ్రామానికి చేరే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.