భీమదేవరపల్లి, జూలై 04 : కొత్తకొండ వీరభద్ర స్వామి ఆభరణాల లెక్కింపు ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్వామివారి ఆలయానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ హైదరాబాద్ జేఈవో అంజలి దేవి, వరంగల్ ఏసీ రామాల సునిత సందర్శించారు. గతంలో ఆలయ ఈవోగా పనిచేసిన కుమ్మరి సులోచన బదిలీపై వెల్లిన సమయంలో ఇక్కడకు వచ్చిన అధికారులకు ఆభరణాలు సరెండర్ చేయలేదు. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న లాకర్ కీలు పోయాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారుల సమక్షంలో యూనియన్ బ్యాంకులోని కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానానికి చెందిన 67, 73, 74 లాకర్లను పగులగొట్టారు.
ఆలయంలోని మరో లాకర్‌ను సైతం పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలను ఆలయంలో పదిల పరిచారు. మిశ్రమ బంగారం, వెండి ఆభరణాలు లెక్కింపు అనంతరం వివరాలను వెల్లడిస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ జేఈఓ అంజలి దేవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు రజనీ కుమారి, ఉడుతల వెంకన్న, మారుతితో పాటు కిషన్ రావు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ధరణికోట అనిల్ కుమార్,ఈవో కిషన్ రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.