కాశీబుగ్గ, అక్టోబర్8 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తియార్డుల్లో బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్దతు ధరలతో పత్తి కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారులు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రయవిక్రయాలు నిర్వహించారు. ఈ కొత్త పత్తి మద్దతు ధర అక్టోబర్ నుంచి ప్రారంభమై వచ్చే సెప్టెంబర్ వరకు వర్తిస్తుంది. కొత్త పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.8110 నిర్ణయించినట్లు తెలిపారు.
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు టీ.నరేశ్ 10 పత్తి బస్తాలు తీసుకురాగా, తేమ శాతం 28 ఉండడంతో క్వింటాకు రూ. 7191తో కొనుగోలు చేశారు. అరవింద్ ట్రేడర్స్ అడ్తి ద్వారా లక్ష్మీప్రద ఖరీదు వ్యాపారుడు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం 2500 బస్తాలు రాగా క్వింటాకు అత్యధికంగా రూ.7191, మధ్యరకం రూ.6800, కనిష్ఠంగా రూ.5500 పలికినట్లు పేర్కొన్నారు.