వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 30 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం రాత్రి వరంగల్ సెంట్రల్ జైలు జాగలో రూ.1100 కోట్లతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ అధికారులతో మాట్లాడారు.
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గడువులోగా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వరంగల్ నగరం హెల్త్ హబ్‌గా త్వరలోనే మారనున్నదని తెలిపారు. కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్‌జోషి తదితరులు పాల్గొన్నారు.
పడిపూజకు ఏర్పాట్లు చేయిస్తా..
కరీమాబాద్ : అయ్యప్పస్వామి రథయాత్ర, పడిపూజకు ఏర్పాట్లు చేయిస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్‌లో నిర్వహించనున్న రథయాత్ర, అయ్యప్పస్వామి పడిపూజ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతామన్నారు. పోలీస్, నగరపాలక సంస్థ, విద్యుత్‌శాఖ సిబ్బందితో మాట్లాడుతానన్నారు.