తాడిచెర్ల నుంచి కాకతీయ థర్మర్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)కి కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి లైన్ క్లియరైంది. ఇందుకు సంబంధించి అటవీశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనివల్ల బొగ్గు రవాణా మరింత సులభం కానుంది. నిత్యం వందలాది లారీల ద్వారా బొగ్గు సరఫరాకు బ్రేక్ పడనుంది. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనుండగా, కాలుష్యంతో పాటు రవాణా ఖర్చుకూడా తగ్గనుంది. ఇప్పటికే బెల్ట్ ఏర్పాటు చేసే మార్గంలో రోడ్డు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తి కాగానే 19 కిలోమీటర్ల పొడవునా కన్వేయర్ బెల్ట్ పనులకు జెన్కో, ఏఎమ్మార్ సంస్థలు శ్రీకారం చుట్టనున్నాయి. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల మధ్య ప్రయాణం మెరుగుపడనుంది.
– జయశంకర్ భూపాలపల్లి, మార్చి 24 (నమస్తే తెలంగాణ)
తాడిచెర్ల ఓపెన్‌కాస్టు గని నుంచి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)కు ఇక బొగ్గు రవాణా సులభతరం కానుంది. నిత్యం లారీల ద్వారా బొగ్గు రవాణా వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు అధికంగా ఉంటున్నది. ఈ క్రమంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ , ఖర్చులను తగ్గించుకోవాలనే లక్ష్యంతో జెన్కో, ఏఎమ్మార్ సంస్థలు రూ. 100 కోట్లతో కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.
తాడిచెర్ల ఓసీ నుంచి కేటీపీపీ వరకు సుమారు 19 కిలోమీటర్ల పొడవున దీనిని ఏర్పాటు చేసేందుకు రోడ్డు పనులు చేపట్టగా ప్రస్తుతం అవి చివరి దశలో ఉన్నాయి. రోడ్డు పూర్తి కాగానే కన్వేయర్ బెల్ట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు తాడిచెర్ల ఓసీపీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేటీపీపీకి ప్రతి రోజు లారీల ద్వారా 7 వేల టన్నుల బొగ్గు రవాణా అవుతున్నది. కన్వేయర్ బెల్ట్ పనులు పూర్తయితే సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. అలాగే ఈ మార్గంలో ప్రజలు తాడిచెర్ల మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు మెరుగుపడనున్నాయి.
తాడిచెర్ల ఓసీపీ నుంచి 7 వేల టన్నులు, భూపాలపల్లి గనుల నుంచి 6 వేల టన్నుల బొగ్గు ప్రతిరోజు వందలాది లారీల్లో కేటీపీపీకి రవాణా అవుతున్నది. ఈ క్రమంలో ధ్వని, వాహన కాలుష్యంతో పర్యావరణం దెబ్బ తింటున్నది. దీనికి తోడు లారీలో ద్వారా బొగ్గు రవాణాకు ప్రతినెలా రూ. 2 నుంచి రూ. 3 కోట్ల ఖర్చవుతున్నదని అధికారులు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు సరఫరా జరిగితే ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతినకుండా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
తాడిచెర్ల ఓసీ నుంచి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ పనులు వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాడిచెర్ల నుంచి అటవీ ప్రాంతం గుండా కాశీంపల్లి శివారు, జంగేడు శివారు, సీపల్లి, కొంపెల్లి మీదుగా కేటీపీపీ వరకు బెల్ట్ నిర్మాణం జరగనుంది. అటవీశాఖ అనుమతులు సైతం రావడంతో రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి. కేవలం కొంపెల్లి , సీపెల్లి గ్రామాల సమీపంలో 3.5 కిలోమీటర్ల పరిధిలో కొన్ని పంటలు ఉండడంతో రైతులు కొంత సమయం అడుగుతున్నారు. మిగిలిన రోడ్డు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.