మహబూబాబాద్, ఆగస్టు 12( నమస్తే తెలంగాణ ) : వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పనికి తగిన వేతనం అందక మనోవేదన చెందుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్హెచ్ఎం కింద 2006-23 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2256 మంది ఉద్యోగులను నియమించగా, అందులో వైద్యులు, స్టాఫ్ నర్స్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అటెండర్లు, ఎల్టీ, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డీపీఎంయూలు, ఎంఎల్హెచ్పీ వంటి 78 క్యాడర్లకు చెందిన వారు ఉన్నారు.
అయితే గత 20 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా, వీరు చాలీచాలని జీతాలతో, అవీ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి రూ. 6 వేల నుంచి 30 వేల లోపు మాత్రమే చెల్లిస్తుండగా, అందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీరికి నెల మెదటి వారంలోనే వేతనాలు అందగా ఎలాంటి ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించేవారు.
కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. ఇంటి కిరాయి కట్టలేక, ఈఎంఐ, నిత్యావసర వస్తువుల కొనుగోలు, పిల్లల చదువులు వంటి అవసరాల కోసం అప్పులు చేసి ఆర్థిక భారంతో కాలం వెల్లదీస్తున్నారు. మరో వైపు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రాష్ర్టాల్లో ఇప్పటికే ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్హెచ్ఎం ఉద్యోగులు గతంలో కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఎన్హెచ్ఎం కార్యాలయం ఎదుట ధర్నాలు చేసి వినతిపత్రాలు అందించారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి, హెల్త్ సొసైటీ ద్వారా వేతనాలు చెల్లించాలని, ప్రతి ఏడాది 5శాతం ఇంక్రిమెంట్, 8శాతం లాయల్టీ బోనస్ అందించాలని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మహిళా సిబ్బందికి 180 రోజుల ప్రసూతి సెలవులు అందించాలనే 10 డిమాండ్లతో ఈ నెల 11న హైదరాబాద్లో శాంతియుత మహాసభ నిర్వహించారు. ఇప్పటికైనా సర్కారు తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పల్లె ప్రజలకు వైద్యం అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానల్లో 80 శాతం మంది సిబ్బంది వీరే ఉన్నారు. వైద్య శాఖలో చేపట్టే అనేక కార్యక్రమాల విజయవంతానికి వీరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రసవాల సంఖ్య పెంపు, మాతా శిశు మరణాల తగ్గింపు, టీబీ నిర్మూలన.. వంటి సేవలందిస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వారు విమర్శిస్తున్నారు.
పనికి తగిన వేతనం లేక.. అవీ సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా సేవలందిస్తున్నా అరకొర జీతాలే. క్రమబద్ధీకరించాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.
– ఉమాకర్, ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు, మహబూబాబాద్