మంగపేట, జూన్16: విద్యార్థులకు సకల సౌకర్యాలతో కస్తూర్బా బాలికల విద్యాలయ భవనం వినియోగంలోకి వచ్చింది. ఈ పాఠశాల 2017 నుంచి చుంచుపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇరుకు గదులు, అరకొర వసతుల నడుమ కొనసాగింది. ఈక్రమంలో కేజీబీవీకి శాశ్వత భవన నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ శాఖ నుంచి రూ. 3.30 కోట్లు మంజూరు చేసింది. మండల విద్యావనరుల కేంద్రం పక్కనే స్థల సేకరణ కూడా పూర్తి చేయడంతో సువిశాలమైన భవనాన్ని నిర్మించా రు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసు నిర్వహణ, తరగతి గదులు, వంటశాల, మొదటి ఫ్లోర్లో విద్యార్థినుల డార్మెటరీ, భోజనశాల, సెకండ్ ఫ్లోర్లో ల్యాబ్, సమావేశపు హాలు ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయంలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అడ్మి షన్లు ఇచ్చే ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ప్రతి ఫ్లోర్లో టాయిలెట్లతోపాటు విద్యార్థినులకు అవసరమైన అన్ని సదుపాయాలతో మూడు అంతస్తులతో నిర్మాణమైన ఈ సువిశాలమైన విద్యాలయం మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నది. గతంలో అరకొర వసతుల నడుమ ఇరుగు గదుల్లో కొనసాగిన కేజీబీవీకి శాశ్వత భవనం నిర్మించడంపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేజీబీవీలో ప్రస్తుతం అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. ఇది వరకు 100 లోపే ఉన్న విద్యార్థిను ల సంఖ్య ఈ విద్యా సంవత్సరానికి 282కు చేరింది. మెయిన్ రోడ్డు పక్కనే సువిశాలమైన భవనం నిర్మాణం పూర్తి కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకు 168 మంది, ఇంటర్మీడియట్లో 62 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. పాత విద్యార్థులు 52 మంది ఉన్నారు. పరిమితికి మించి విద్యార్థినులు రావడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది.