వరంగల్, మే 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు మనదేనని, యువత బీఆర్ఎస్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలపై బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన మూడు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తున్నదని, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను గ్రాడ్యుయేట్లకు వివరించాలని సూచించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొదటి నుంచి బీఆర్ఎస్కు ఆదరణ ఉన్నదని అన్నారు. ఈ సెగ్మెంట్లో జరిగిన ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే యువతకు మేలు జరుగుతుందని, ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితిని గెలిపించాలని ఓటర్లకు వివరించాలని కేటీఆర్ సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల జడ్పీ అధ్యక్షులు మారెపల్లి సుధీర్‌కుమార్, అంగోతు బిందు, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు.