హనుమకొండ చౌరస్తా, జూన్ 26: కాంగ్రెస్ పాలన నిల్, పబ్లిసిటీ ఫుల్లా ఉందని, చేయని పనులకు చేశామని చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ 6వ డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు ఆరోపించారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 ఏండ్ల ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ సబ్బండ వర్గాలను, కులాలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న అనంతరం కేసీఆర్ హయాంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు నిర్మించారన్నారు. వాటికి సాక్ష్యాలే కమ్యూనిటీ హాళ్లు అని గుర్తు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపుల 40 ఏండ్ల కలను సాకారం చేయడం కోసం మాజీ చీఫ్ విప్, దాస్యం వినయ్ భాస్కర్ ఎంతో కృషి చేశారన్నారు.
వినయ్ భాస్కర్ మాట ఇచ్చి, నిధులు తెచ్చి మున్నూరు కాపు చిరకాల కలను నిజం చేశారన్నారు. నాటి నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞతకే వొదిలేస్తున్నామన్నారు. నీలం రాజ్ కిశోర్ మాట్లాడుతూ..నిన్నా మొన్న గెలిచిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంతా మేమే చేశాం..మేమే నిధులు తెచ్చామన్న తీరు చూస్తే నవ్విపోదురుగా… నాకేంటి అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా నాటి శంకుస్థాపన ఫొటోలు, నిధుల జీవోలను మీడియాకు చూపించారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరికారి శ్రీధర్, నాయకులు నీలం సుహాస్, హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు వరుణ్, జిల్లా కాపు నాయకులు నవీన్, బచ్చు అనిల్, వేణుగోపాల్, నగేష్, నవీన్ పాల్గొన్నారు.