పాలకుర్తి, జూన్ 7 : తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని కబ్జా చేయడానికి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యత్నిస్తున్నాడని పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు తన కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్ చౌరస్తాలో ధర్నాకు దిగాడు. సుమారు అర్ధగంటపాటు ఎండలో ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే… మల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతం వెంకన్నకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కుమారుడికి వెంకన్న భూమి రిజిస్ట్రేషన్ చేశాడు. పెద్ద భార్య ఆమె కుమారుడు 2009లో ఖమ్మం జిల్లాకు చెందిన కొనకంచి సురేశ్‌కు ఆ 5ఎకరాల 20గుంటల భూమిని విక్రయించారు. తిరిగి ఆ భూమిని మల్లంపల్లి గ్రామానికి వలస వచ్చిన వడ్డెర కులానికి చెందిన రూపాని యాదమ్మ, సాలయ్య దంపతులకు సురేశ్ విక్రయించాడు. కొన్నేళ్లు వ్యవసాయం చేసుకున్నారు.
వృత్తిరీత్యా సాలయ్య, యాదమ్మ దంపతులు వలస పోగా ఆ భూమిని చింతం వెంకన్న కబ్జా చేశాడు. ఈ విషయంలో కొన్నేళ్లుగా ఇరువర్గాలకు మధ్య పంచాయతీ, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే స్థానిక నాయకుల అండదండలతో 2024లో చింతం వెంకన్న భూమిని సాగు చేయడానికి వెళ్లాడు. దీంతో రూపాని యాదమ్మ, సాలయ్య కుటుంబ సభ్యులకు చింతం వెంకన్నతో గొడవ జరిగింది. చింతం వెంకన్నతోపాటు కొడుకు, కుటుంబ సభ్యులు రూపాని యాదమ్మ, ఆమె కొడుకు, కుమార్తెలపై దాడి చేశారు. ఇరువర్గాలు గొడవకు దిగాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. చింతం వెంకన్న కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతోనే పాలకుర్తి ఎస్సై తమపై ఆక్ర మ కేసులు పెడుతున్నాడని రూపాని యాదమ్మ, దివ్యాంగుడు రూపాని సాల య్య ఆరోపించారు.
మమ్ముల్నే కొట్టి మా పైనే అక్రమ కేసులు పెడతారా.. అంటూ దివ్యాంగుడు రూపాని సాలయ్య, యాదమ్మ మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో పోలీసులకు వ్యతిరేకంగా ఎండలో ధర్నాకు దిగారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ పేదలపై అక్రమ కేసులు పెడుతున్నారని దివ్యాంగుడు సాలయ్య ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సాలయ్య, యాదమ్మ వాపోయారు. పాలకుర్తి ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ విషయంపై దూలం పవన్‌కుమార్‌ను వివరణ కోరగా ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. భూ సమస్యలు ఉంటే సివిల్ కోర్టులో పరిష్కారించుకోవాలన్నారు.