అసెంబ్లీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయమున్నా ముందుగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. సిట్టింగ్‌లకే టికెట్ల కేటాయింపుతో కార్యకర్తలు సంబురాలు చేసుకొంటున్నారు. అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయాలకు తరలివస్తూ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతున్నారు. బొకేలు అందించి స్వీట్లు తినిపిస్తూ సందడి చేస్తున్నారు. తమ అభిమాన నాయకులను మళ్లీ గెలిపించుకుంటామని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని ధీమాగా ఉన్నారు.
ఎమ్మెల్యే నరేందర్‌కు శుభాకాంక్షలు వెల్లువ
గిర్మాజీపేట, ఆగస్టు 26 : తూర్పు నియోజకవర్గ టికెట్‌ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు కేటాయించడంతో కార్పొరేటర్లు, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పరపతి సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, మైనార్టీ సంఘాల సభ్యులు, వడుప్సా జిల్లా సంఘం నాయకులు, కమ్యూనిటీ సంఘాల సభ్యులు, కుడా చైర్మన్, మాజీ చైర్మన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 6 గంటల నుండే శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో భారీ సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందిస్తూ, శాలువాలు కప్పి ఘనంగా సత్కరిస్తున్నారు. దీంతో శివనగర్ రోడ్డు, క్యాంపు కార్యాలయ ఆవరణ కార్యకర్తలు, మద్దతుదారులతో సందడిగా కనిపిస్తున్నది. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సారి ప్రతి కార్యకర్త పట్టుదలతో ఉన్నారు. రూ. 4 వేల కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్న ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే నరేందర్‌కు సీఎం కేసీఆర్ రెండోసారి టికెట్ కేటాయించడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి, పటాకులు పేలుస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు.
ఎమ్మెల్యే పెద్దికి అభినందనల వెల్లువ
నర్సంపేట : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. క్యాంపు కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలిరావడంతో నిత్యం సందడిగా మారుతున్నది. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, సానుభూతిపరులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. స్వీట్లు, బొకేలు, శాలువాలు, జ్ఞాపికలు, ఫొటోలు అందిస్తూ పెద్ది సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నియోజకవర్గం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిందని, మొదటి విడతలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పనులను పెద్ది సుదర్శన్‌రెడ్డి చేశారని అంటున్నారు. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతారనే నమ్మకం తమకు ఉందంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉంటూ నర్సంపేటకు రూ.కోట్ల నిధులు తెచ్చారని చెబుతున్నారు. అభివృద్ధిలో ముందున్న నర్సంపేటను మరింత ముందుకు తీసుకుపోగల సత్తా పెద్ది సుదర్శన్రెడ్డికే ఉంటుందని అంటున్నారు. అన్ని రంగాలకు చెందిన నాయకులు, ప్రజలు, వ్యాపారులు ఎమ్మెల్యే పెద్దిని కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం వస్తుండడంతో క్యాంపు ఆఫీస్ కిక్కిరిసిపోతున్నది. అలాగే, గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే అరూరికి వెల్లువలా శుభాకాంక్షలు
వర్ధన్నపేట : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడో సారి ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ఆయన నివాసంతో పాటుగా నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయానికి తరలివస్తున్నారు. అంతేకాక గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు కూడా కార్యకర్తలు ఆయనను కలిసి అభినందిస్తున్నారు. గతంలో రాష్ట్రంలోనే రెండో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అరూరిని గెలిపించారు. మూడోసారి కూడా ఘన విజయం సాధిస్తాడని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు ప్రజల మధ్యలో ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న అభిమాన నాయకుడికి మరోసారి టికెట్ రావడంతో హ్యాట్రిక్ సాధిస్తాడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.