కమలాపూర్, జనవరి 24 : కమలాపూర్‌లో కాంగ్రెస్ నా యకులు రెచ్చిపోయారు. అక్కడి గ్రామ పంచాయతీ లో శుక్రవారం జరిగిన గ్రా మసభలో అధికార అండతో దౌర్జన్యం చేశారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. కాగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ మాట్లాడుతూ గత ప్రభు త్వం పదేళ్లలో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించిందని ఒక్క రేషన్ కార్డు, ఇల్లు ఇవ్వలేదని, కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపయోగం అయ్యాయని వ్యాఖ్యలు చేయగా.. ఎమ్మెల్యే లేచి వెంటనే బీఆర్ఎస్ సర్కారు ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, డబుల్‌బెడ్ రూం ఇండ్లు కట్టింది వాస్తవం కాదా అని ప్ర శ్నించారు.
దీంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా కాజీపేట ఏసీపీ తిరుమల్ ఇది అధికారిక కార్యక్రమమని.. రాజకీయ విమర్శలు చేయొద్దని చైర్మన్ ఝాన్సీకి సూచించారు. అయితే ఎమ్మెల్యేకు కూడా ఏసీపీ చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు స్టేజీపైకి దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకున్నా ఆగలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్టేజీ కిందకు దిగి ప్రజల మధ్య కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమలాపూర్‌కు ఎన్ని ఇండ్లు మంజూరు చేసిందో ఎంపీడీవో చెప్పాలని ప్రశ్నించగా కమలాపూర్‌కు 1440 ఇండ్లు, ఇంటి జాగ లేని వారికి 259 లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసినట్లు ఎంపీడీవో బాబు చెప్పారు.
ఎంపికైన లబ్ధిదారుల్లో ఎంతమందికి ఇండ్లు ఇస్తరో ఎంపీడీవో చెప్పా లని కౌశిక్‌రెడ్డి గట్టిగా ప్రశ్నించారు. నియోజకవర్గానికే 3500 ఇండ్లు వస్తే కమలాపూర్‌కు ఎన్ని ఇండ్లు వస్తాయో చెప్పాలని అడగడంతో కాంగ్రెస్ నాయకులు మరింత అసహనానికి గురై రాళ్లు, టమాటాలు విసిరారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభ గందరగోళంగా మారింది. ఆ తర్వాత ఎంపీడీవో బాబు.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని స్టేజీ మీదకు రావాలని ఆహ్వానించారు.
మాట్ల సంతోష, పబ్బు సమ్మక్క, కనకలక్ష్మిలు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఝాన్సీలకు గోడు వెళ్లబోసుకుంటుండగా ఎమ్మెల్యే బాధితులకు మైకు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి లబ్ధి పొంది ఇవాళ అధికారం పోగానే కాంగ్రెస్‌లో చేరి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా? సిగ్గుండాలె? నేను సీఎం రేవంత్‌రెడ్డికే భయపడలే, మీకు భయపడతానా? ఏండ్ల తరబడి జెండా మోసిన నిజమైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే నేను ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదన్నారు. బీఆర్ఎస్ తరపున సభను బైకాట్ చేస్తున్నానని చెప్పి కుర్చీలోంచి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు విసరడంతో మండల వ్యవసాయాధికారి రాజ్‌కుమార్‌కు తగిలింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎమ్మెల్యేను కాన్వాయ్ వద్దకు తీసుకెళ్లారు. ఏసీపీ తిరుమల్, సీఐ హరికృష్ణ, హసన్‌పర్తి సీఐ చేరాలు, ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఎస్సై వీరభద్రరావులతోపాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించి భౌతికదాడులు చేసుకోకుండా ఇరువర్గాలను పంపారు.