పరకాల, మే 13 : బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. నాగారంలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, చిట్టిరెడ్డి రత్నాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్య పోలింగ్ సరళిపై చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కర్రలతో వారిపై దాడి చేశారు. నాగ య్య, రత్నాకర్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం మాజీ ఎంపీటీసీ ఏరుకొండ శ్రీనివాస్ తన ద్వి చక్ర వాహనంలో పెట్రోల్ పోసుకోడానికి బస్టాండ్ వద్దకు వెళ్లగా అకారణంగా అతడిపై కూడా దాడి చేసి గాయపరిచారు.
బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ గుండాలపై కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు.
సుమారు అరగంట పాటు ఆందోళన చేయగా, సీఐ రవిరాజు బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడి శాంతింపజేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులపై దాడి ఘటనలో 9మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవిరాజు తెలిపారు. నాగారం గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి రత్నాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన మాచబోయిన అజయ్, బొజ్జం నరేశ్, బొజ్జం సురేశ్, బాలాజీ నవీన్, కట్కూరి దేవేందర్ రెడ్డి, మాచబోయిన తిరుపతి, మాచబోయిన రాజు, మాచబోయిన రవి, ముంజాల కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.