జనగామ, మే 13 (నమస్తే తెలంగాణ) : జనగామలోని ధర్మకంచ పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ నాయకులు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకున్నా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ ఏసీపీ అంకిత్, అర్బన్ సీఐ రఘుపతిరెడ్డిని నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల నడుమ తోపులాట జరిగింది. ఏసీపీ అంకిత్‌కు ఎమ్మెల్యే పల్లా నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో తనను చేతులతో నెట్టి వేసేందుకు యత్నించిన ఏసీపీపై ‘డోంట్ టచ్’ అంటూ ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా, పోలీసు అధికారులు కాంగ్రెస్‌కు వంతపాడుతూ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గానుగుపహాడ్‌లో సైతం ఓటేసేందుకు రోడ్డుపై ఉన్న ప్రజలపై అర్బన్ సీఐ అకారణంగా లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి, జిల్లా ఎన్నికల అధికారి, సీపీ, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.