తొర్రూరు, జూన్ 10 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోరిన ఒక సాధారణ మహిళను కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూషించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..గుగ్గిళ్ల శ్రీదేవి అనే మహిళ తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరిన సందర్భంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న ఆమెను కర్రె మొహందాన నువ్వేమన్నా పైసలు ఇచ్చినవా? నీకు ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏమీ లేదు” అంటూ తీవ్రంగా అవమానించినట్లు బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వలేని వారికి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పథకానికి అర్హులైన అనేక మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో, ఇల్లు అడిగినందుకే మహిళను దూషించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. అధికారుల ప్రకారం.. గుగ్గిళ్ల శ్రీదేవి పేరుపై గతంలో ఇల్లు మంజూరు అయినట్లు, బిల్లులు తీసుకున్నట్టు రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే శ్రీదేవి మాత్రం తాను ఇల్లు కట్టలేదని, ఈ విషయం తనకు పూర్తిగా తెలియదని, తన పేరును వాడుకుని ఎవరో కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. పథకాల్లో అవకతవకలు, పేదలపై దౌర్జన్యానికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.