హనుమకొండ, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. కోట్ల ఆదాయం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు.. వారు రూ. లక్షలు సర్కారుకు చెల్లించకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. హనుమకొండ బస్టాండ్ జంక్షన్‌లోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కి 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నది. దీనిని చదరపు అడుగుకు నెలకు రూ.15 చొప్పున కాంగ్రెస్‌కు చెందిన తాజా మాజీ కార్పొరేటర్ లీజుకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆరు నెలల కిరాయి ముందస్తుగా చెల్లించాలి. అధికార పార్టీ నేత కావడంతో లీజు నిబంధనలను ఖాతరు చేయలేదు.
ఆరు నెలల ముందస్తు కిరాయి సంగతి పక్కనబెడితే.. రెండేండ్లుగా ఒక్క రూపాయి చెల్లించలేదు. ఇలా రూ. 2 కోట్ల కిరాయి మొత్తం చెల్లించాల్సి ఉండగా, కుడా మాత్రం మొహమాటంగా నోటీసులిస్తూ పోయింది. ఇలా రెండేండ్లు గడిచినప్పటికీ అతడు కిరాయి చెల్లించడంలేదు. అధికార పార్టీ నాయకుడు కావడంతో వ్యవహారాన్ని సున్నితంగా నడిపిద్దామనుకున్న కుడా అధికారులు పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ఎట్టకేలకు స్పందించారు. సోమవారం అధికారులు స్వయంగా వెళ్లి కమర్షియల్ కాంప్లెక్స్‌లోని షట్టర్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. వెంటనే లీజు బకాయి చెల్లించాల్సిన కాంగ్రెస్ నాయకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు.
అధికారులు ఇలా చేస్తే అధికార పార్టీలో ఉండడం ఎందుకని వాపోవడంతో ఆయన వెంటనే స్పందించారు. కమర్షియల్ కాంప్లెక్స్ షట్టర్ల తాళాలను వెంటనే తీయాలని, కిరాయి చెల్లించేందుకు మరింత గడువు ఇవ్వాలన్న ఎమ్మెల్యే అదేశాలను అధికారులు పాటించారు. రూ. 2 కోట్ల కిరాయి మొత్తం పెండింగ్‌లో ఉన్నా షట్టర్ల తాళాలను లీజుదారుడైన కాంగ్రెస్ నేతకు అప్పజెప్పారు. గంటల్లోనే అన్నీ తెరుచుకున్నాయి. ఈ వ్యవహారం వరంగల్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. కరెంటు, మంచి నీళ్ల బిల్లులు చెల్లించకపోతేనే పేదలు, మధ్య తరగతి వారి ఇండ్ల వద్దకు వచ్చి హడావుడి చేసే అధికారులు రూ. కోట్లు చెల్లించని అధికార పార్టీ నాయకుడికి అనుకూంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద బేరం
వరంగల్ మహానగరంలోని ప్రధాన జంక్షన్లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూ.5 కోట్లతో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో దాదాపు 50 వరకు షట్టర్లున్నాయి. చదరపు అడుగుకు రూ.15 చొప్పున లీజు పొందిన కాంగ్రెస్ నాయకుడు ఈ కాంప్లెక్స్‌ను దాదాపు 25 మందికి చదరపు అడుగుకు రూ.80 చొప్పున కిరాయికి ఇచ్చాడు. కన్వెన్షన్ హాల్, హోటల్, డయాగ్నస్టిక్ సెంటర్, ఇతర వ్యాపారస్తులు ఈ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. కుడాకు ప్రతి నెల రూ. 9 లక్షలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకొని ప్రైవేటు వారికి రూ. 48 లక్షలకు కిరాయికి ఇచ్చాడు. ఇలా ప్రతి నెలా ఆదాయం పొందుతూ లీజు మొత్తాన్ని మాత్రం చెల్లించడం లేదు. కుడా అధికారులు ఇప్పటికైనా స్పందించి కాంగ్రెస్ నాయకుడి గుప్పిట్లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌ను స్వయంగా నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆన్లైన్ టెండరు ప్రక్రియ నిర్వహించి ఎక్కువ మొత్తం చెల్లించే వారికి కమర్షియల్ కాంప్లెక్స్‌ను ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిదా ఛాన్స్
రెండేండ్లుగా లీజు మొత్తం ఎగవేస్తున్న కాంగ్రెస్ నాయకుడికి అధికారులు మరోసారి అవకాశం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కాంగ్రెస్ నాయకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రూ.2 కోట్లను మూడు వాయిదాల్లో చెల్లించేలా గడువు ఇచ్చారు. మొదటి వాయిదాను నెల వరకు చెల్లించినా పర్వాలేదని చెప్పారు. కుడా కాంప్లెక్స్ లీజు వ్యవహారంలో అధికారుల తీరుపై మొదటి నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు నెలలకోసారి కిరాయి చెల్లించాలని అగ్రిమెంట్లో ఉన్నప్పుడు రెండేండ్ల వరకు ఎందుకు మినహాయింపు ఇచ్చారనే సందేహాలు నెలకొన్నాయి. కుడా అధికారుల ఉదాసీనత కారణంగానే కాంగ్రెస్ నాయకుడు కమర్షియల్ కాంప్లెక్స్ లీజు మొత్తాన్ని ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తూతూ మంత్రంగా నోటీసులతో ప్రయోజనం ఉండదని తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.