నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కాంగ్రెస్ సర్కారు రైతుల ఉసురుపోసుకుంటున్నది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక కన్నీళ్లు పెట్టిస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కాంటా పెట్టకుండా ఇబ్బందిపెడుతున్నది. లారీలు రాక.. కాంటాలు కాక.. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను కాపాడుకోవడానికి రోజుల తరబడి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అక్కడే పడిగాపులుగాస్తున్నారు. ఓపిక నశించి సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పట్టించుకునేవారే లేక ఆగమవుతున్నారు. చివరికి కొనుగోళ్లు ఆలస్యమవడంతో నెక్కొండ మండలం అలంకానిపేటలో ఓ రైతు గుండె ఆగగా, జనగామ జిల్లా ఏనెబావిలో మరోరైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యానికి ఓ రైతు బలయ్యాడు. కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ఎదురుచూపులు.. మండుతున్న ఎండలతో నెక్కొండ మండలం అలంకానిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదివారం గాజుల పెద్ద వెంకటేశ్వర్లు(60) అనే రైతు గుండెపోటు మృతిచెందాడు. రెండు ఎకరాల్లో మక్కజొన్న, మూడు ఎకరాల్లో వరిసాగు చేసిన రైతు వాటిని అమ్ముకునేందుకు 15 రోజులుగా పడరానిపాట్లు పడ్డాడు. ఆదివారం అలంకానిపేటలోని కొనుగోలు కేంద్రంలో బస్తాల్లోకి ధాన్యాన్ని నింపుతుండగా ఎండల తీవ్రతకు అస్వస్థతకు గురైన రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనెబావిలో కాంగ్రెస్ నాయకుడు పొన్నాల తిరుమలేశ్ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏనెబావి జీపీ పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తిరుమలేశ్ 200 బస్తాలకు పైచిలుకు ధాన్యాన్ని 25 రోజుల క్రితం తరలించాడు. కాంటాల్లో జాప్యంతోపాటు లారీలు రావడంలేదని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ధాన్యం కాంటాలు కాకపోవడంతో సర్కారు తీరును నిరసిస్తూ ఒంటిపై డీజిల్ చల్లుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన రైతులు వెంటనే అడ్డుకున్నారు.
పక్షం రోజుల క్రితం కాంటా అయిన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో ఆదివారం రైతులు ఆందోళన నిర్వహించారు. స్థానిక లారీ ఆఫీసు ముందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను అధికారులు సమకూర్చడంలేదని, 50 రోజులుగా కల్లాల్లోని ధాన్యం రాశులు, బస్తాల్లో నింపిన వడ్లు ఎండకు ఎండుతూ, వర్షానికి తడస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ సంచుల పంపిణీలో అవకతకలు, కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో ఆదివారం రైతులు ఆందోళన నిర్వహించారు.
సర్కారు నిర్లక్ష్యంతో పంటల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, సరిపడా గన్నీ సంచులు ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. మరోవైపు లారీలు అందుబాటులో లేకపోవడం, కాంటాలు ఆలస్యం కావడంతో నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు కొనుగోలు కేంద్రానికి తరలి వచ్చిన రైతులు ఆదివారం పాలకుర్తి- జనగామ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలిస్తే.. మిల్లు యజమానులు సాకులు పెడుతూ కొనడం లేదన్నారు.
సకాలంలో లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోళ్లు నిలిచిపోవడంతో కడుపుమండిన అన్నదాతలు పాలకుర్తి మండలంలోని ఈరవెన్నులో రోడ్డెక్కి ధర్నాకు దిగారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా లారీలు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు ఈదూనూరి మదార్ రైతులు నల్ల చిన్న నాగయ్య, కోనుకటి బుచ్చయ్య, కోడిశాల యాదగిరి, ఒర్రె యాదయ్య, అనుముల నర్సయ్య, దామెర రాజయ్య, కాసోజు సమ్మయ్యచారి, కుమార్, ముస్కు సంజీవ, ఎల్లయ్య, సంపత్, దామోదర్, మహేందర్, చంద్రయ్య, సుధాకర్ పాల్గొన్నారు.