తొర్రూరు/నెల్లికుదురు/బయ్యారం/మహబూబాబాద్ రూరల్/కొత్తగూడ/ఖానాపురం, ఆగస్టు 13 : రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా సరిపడా బస్తాలు దొరకక అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు. యూరియా దొరకకపోవడంతో మరికొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. యూరియా వస్తున్నదన్న సమాచారంతో నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట వివిధ గ్రామాల రైతులు సుమారు 500 మంది ఉదయం 5 గంటల నుంచే బారులు దీరారు. సొసైటీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు క్యూలైన్లో నిల్చొని ఇబ్బందులు పడ్డారు.
అయినప్పటికీ ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పన పంపిణీ చేయడంతో దాదాపు 200 మంది బస్తాలు యూరియా దొరకక వెనుదిరిగారు. తొర్రూరులో బుధవారం యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అన్నారం రోడ్డులోని పీఏసీఎస్, కో-ఆపరేటివ్ ఎరువుల దుకాణం ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం నుంచే గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అయితే యూరియా స్టాక్ లేదంటూ యాజమాన్యం చెప్పడంతో రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. యూరియా సరఫరా సరిగా లేకపోవడంతో పంటలపై ప్రభావం పడుతున్నదని, తక్షణం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.
మానుకోట పట్టణంలోని పీఏసీఎస్ వద్ద రైతులు ఉదయం నుంచే బారులు తీరినప్పటికీ లోడ్ రాలేదంటూ కొంతమందికే ఇచ్చి పంపించారు. దీంతో అన్నదాతలు సొసైటీ ముందు ధర్నా చేపట్టగా సీపీఐ నాయకులు మద్దతు పలికారు. ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఏవో తిరుపతిరెడ్డి అక్కడకు చేరుకొని మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించి సరిపడా యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చుంటున్నామని, ప్రభుత్వం తక్షణం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బయ్యారం పీఏసీఎస్ పరిధిలోని ఉప్పలపాడు , కొత్తపేట, కంబాలపల్లి సబ్ సెంటర్లలో యూరియా నిల్వలు లేక పోవడంతో కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని విక్రయ కేంద్రానికి వచ్చి స్టాక్ లేకపోవడంతో రైతులు వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం స్టాక్ వచ్చిందని తెలియడంతో ఉదయం ఆరు గంటల నుంచి సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు .అయితే కేవలం 26 మెట్రిక్ టన్నుల (570 బస్తాలు) యూరియా రాగా సిబ్బంది కొంతమంది రైతులకే సరిపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలకేంద్రంలోని సొసైటీ ఎరువుల గోదాముకు 888 బస్తాల యూరియా రావడంతో రైతులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు.